Pillalamarri: ఆసియాలోనే రెండో పెద్ద వృక్షం

13 Sep, 2022 08:39 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లో ఉన్న పిల్లలమర్రి ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద వృక్షం అని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని పిల్లలమర్రిని ఆయన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ కార్యక్రమం ప్రారంభం తర్వాత రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో హరితహారం విజయవంతమైనందుకే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. 

ఈ మంచి కార్యంలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రోత్సహిస్తున్నారన్నారు. వివిధ కారణాల వల్ల మర్రి వృక్షం చనిపోయే దశకు రాగా కలెక్టర్లు, అటవీశాఖ తదితర శాఖల సహకారంతో పునర్జీవం ఇచ్చారన్నారు. జిల్లాలో గతేడాది 2 కోట్ల విత్తన బంతులను తయారు చేసి డ్రోన్‌ ద్వారా గుట్టలు, కొండలలో, బంజరు భూములలో చల్లించామన్నారు. అంతే కాక విత్తన బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించామని, ఈ సంవత్సరం కూడా చల్లుతున్నామని తెలిపారు. 

అపురూపంగా చూసుకోవడం సంతోషం 
గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పిల్లలమర్రి అభివృద్ధికి తనవంతుగా ఎంపీ నిధుల నుంచి రూ.2 కోట్లు మంజూరు చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విటర్‌లో సైతం పేర్కొన్నారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రిని అపురూపంగా చూసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంత్రితో కలిసి పిల్లలమర్రి చెట్లు ఎక్కిన ఫొటోను ట్విటర్‌కు ట్యాగ్‌ చేశారు. వివిధ కారణాలతో పూర్తిగా పాడైపోయే దశకు చేరుకున్న పిల్లలమర్రి వృక్షానికి సెలైన్లు ఎక్కించి బతికించడమే కాక ప్రతి వేరును అభివృద్ధి చేస్తున్న మంత్రిని, అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.

కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావ్, ఎస్పీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర క్రీడా అధికార సంస్థ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అబ్దుల్‌ రహమాన్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు