రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల వెల్లువ

26 Sep, 2023 03:05 IST|Sakshi
వరల్డ్‌ టూరిజం డే వేడుకలను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌  

టెంపుల్‌ టూరిజం విశేషంగా ఆకట్టుకుంటోంది: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

శిల్పకళావేదికలో వరల్డ్‌ టూరిజం డే వేడుకలు ప్రారంభం

మాదాపూర్‌: రాష్ట్రంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచదేశాలతో పోటీ పడుతోందన్నారు. రాష్ట్రంలో సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని, విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విదేశీ పర్యాటకులు దేశంలో ఎక్కువ శాతం రాష్ట్రాన్ని సందర్శిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా రిజర్వాయర్లు కడుతున్నారని వాటిని సందర్శకులు వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్రంలో టెంపుల్‌ టూరిజం విశేషంగా ఆకట్టుకుంటోందని వివరించారు. శ్రీనివాస్‌గౌడ్‌ మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో సోమవారం వరల్డ్‌ టూరిజం డే–2023 వేడుకలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ జిల్లా కేంద్రంలో మూడు రోజులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఫుడ్‌ ఫెస్టివల్, చేనేత ఉత్పత్తుల స్టాల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వేడుకలకు వచ్చిన ప్రతినిధుల కోసం తెలంగాణ ఫుడ్‌ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రతి చెరువు వద్ద బోటింగ్‌ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు.

మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో చివరిరోజు అవార్డులను ప్రదానం చేస్తామని వెల్లడించారు. అనంతరం శ్రీనివాస్‌ గౌడ్‌ పర్యాటక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక కమిషనర్‌ శైలజారామయ్యర్, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎండీ మనోహర్, డైరెక్టర్‌ నిఖిల పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు