బాల్యాన్ని ‘నులి’పేస్తోంది..!

10 Aug, 2020 09:37 IST|Sakshi
విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేస్తున్న అధికారులు (ఫైల్‌)

నేడు నులిపురుగుల నివారణ దినోత్సవం 

జిల్లాలో 2,71,117 బాలబాలికలు  70 శాతం మంది 

రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తింపు 

కరోనాతో అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ రద్దు

పాలమూరు: కడుపులో నులిపురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. రక్తహీనత, కడుపునొప్పి వాంతులు శారీరక, మానసిక ఎదుగుదల, ఇతర సమస్యలు ఎదురవుతాయి. ఈ నులిపురుగులను నివారించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని 1 నుంచి 19 సంవత్సరాలలోపు ఉండే చిన్నారులకు, యువతీ యువకులకు అల్బెండజోల్‌ మాత్రలు వేయాల్సి ఉండగా.. ఈ ఏడాది కరోనాతో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు బంద్‌ ఉండటంతో ప్రభుత్వం ఈ సారి ఈ కార్యక్రమం చేపట్టడం లేదు.  

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1నుంచి 19ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 2,71,117 బాలబాలికలు ఉన్నారు. ఇందులో సుమారు లక్ష మంది పిల్లలు రక్తహినత, పోషకాహార లోపంతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. రక్తహీనత ఉన్నవారిలో ఆకలి లేకపోవడం, బలహీనంగా, నీరసంగా, ఆందోళన ఉండటం లాంటి సమస్యలు వస్తాయి. తరచూ కడుపునొప్పి రావడం జరుగుతుంది. వికారంగా ఉండటం, మలంలో రక్తం వస్తుంది. 

మాత్రలతో ప్రయోజనాలు : నులి పురుగులను నిర్మూలించడానికి ప్రత్యేకంగా మందులు తీసుకోవడంతో వాటిని పూర్తిగా నాశనం చేస్తే ప్రత్యేక్షంగా రక్తహీనత సమస్య తీరుతుంది. రక్తహీనతను నియంత్రిస్తుంది, రక్తశాతం పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత్త పెరుగుతుంది. పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. చిన్నారుల్లో పోషక విలువలు పెరుగుతాయి. పిల్లలు తీసుకునే పోషక, ఆహార పదార్థాలు వారి శరీరానికి సరిగ్గా అందుతాయి. పరోక్షంగా పిల్లల్లో వ్యాధి నిరధోక శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత, అభ్యసన సామర్థ్యం పెరుగుతుంది. ఈ ప్రయోజనాలు సాధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది ఆగస్టు 10న జాతీయ నులిపురుగు నిర్మూలన దినం నిర్వహించాలని నిర్ణయించింది. నులిపురుగు నిర్మూలనకు ఒక్క అల్బెండజోల్‌ మాత్రను నోట్లో వేసుకొని చప్పరిస్తే చాలని వైద్యులు తెలియజేశారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తితో చేయడం లేదు  
జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండటంతో నులి పురుగు నివారణ దినం చేయడం లేదు. వైరస్‌ కారణంగా మాత్రల స్టాక్‌ కూడా రాలేదు. ప్రస్తుతం అన్ని రకాల పాఠశాలలు, కళాశాలలు మూతపడి ఉన్నాయి. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పిల్లలకు మాత్రలు పంపిణీ చేస్తాం.  – డాక్టర్‌ కృష్ణ, డీఎంహెచ్‌ఓ

అంగన్‌వాడీ సెంటర్లు 1,185 
విద్యార్థులు 43,353 
ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు 1,240 
విద్యార్థులు 2,02,220
కళాశాలలు 30 
విద్యార్థులు 25,544 
జిల్లాలో 1 నుంచి 5 ఏళ్ల వారు 49,725 
6 నుంచి 9 ఏళ్ల వారు 1,04,567 
10 నుంచి 19 ఏళ్ల వారు 1,11,937 
బడిబయట చిన్నారులు 4,888 మంది 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు