హైదరాబాద్‌ను ఆగం చేస్తున్న బయో వ్యర్థాలు..! వైద్యారోగ్య శాఖ  తనిఖీల్లో విస్తుపోయే అంశాలు

17 Oct, 2022 18:56 IST|Sakshi

సూదిమందు.. వాడిపడేసిన కాటన్‌.. టానిక్‌ సీసా.. ఇతరత్రా ఆస్పత్రి వ్యర్థాలు మహానగరాన్ని ముంచెత్తుతున్నాయి. వాటిలోని బ్యాక్టీరియా, వైరస్‌లు వాతావరణంలో కలిసి నగరాన్ని రోగాల కుంపటిగా మారుస్తున్నాయి. ఇప్పటికీ అనేక ఆస్పత్రులు తమ వ్యర్థాలను ఆరు బయట తగులబెడుతుండడంతో అనేక మంది అంటురోగాల బారిన పడుతున్నారు. అత్యాధునిక వైద్యానికి, అనేక అరుదైన చికిత్సలతో మెడికల్‌ హబ్‌గా గుర్తింపు పొందిన గ్రేటర్‌ను ప్రస్తుతం ఆస్పత్రి వ్యర్థాలు దడ పుట్టిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా గ్రేటర్‌ జిల్లాల పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. మెజారిటీ క్లినిక్‌లు, నర్సింగ్‌ హోమ్‌లకు పీసీబీ అనుమతులు, జీవ వ్యర్థాల నిర్వహణ సర్టిఫికెట్లు లేకపోవడం గమనార్హం.  

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో ఉన్న 3,919 ఆస్పత్రుల్లో 60 వేలకుపైగా పడకలు ఉన్నట్లు అంచనా. ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 300 నుంచి 400 గ్రాముల వరకు జీవవ్యర్థాలు వెలువడుతున్నట్లు పీసీబీ లెక్కవేసింది. గ్రేటర్‌ నుంచి నిత్యం 35 టన్నులు, శివారు పురపాలికల నుంచి మరో 15 టన్నుల వరకు ఆస్పత్రి వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా వేసింది. ఈ వ్యర్థాలను కార్పొరేట్‌ ఆస్పత్రులు మినహా ఇతర ఆస్పత్రులు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా సాధారణ చెత్తతో పాటే పడవేస్తుండడంతో బ్యాక్టీరియా, వైరస్‌లు గాలిలో కలిసి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సాధారణ చెత్తతోనే వ్యర్థాలు 
ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ చట్టం– 1998 ప్రకారం ఆస్పత్రుల్లో రోజువారీ ఉత్పత్తయ్యే చెత్తను వేర్వేరు రంగుల డబ్బాల్లో నింపాలి. 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు. వీటిని శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్‌ చేసేందుకు ప్రత్యేకంగా నెలకొల్పిన కేంద్రాలకు తరలించాలి. రవాణాలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచరణలో ఈ నిబంధనలు అమలు కావడంలేదు. గాందీ, ఉస్మానియా, కోఠి ప్రసూతి ఆస్పత్రి, నిమ్స్‌ సహా పలు ఆస్పత్రుల యాజమాన్యాలు సాధారణ చెత్తతో పాటే ఆస్పత్రి వ్యర్థాలను గుట్టలుగా పోగుచేసి తగులబెడుతుండడంతో వాతావరణం కలుషితమవుతోంది. ఈ పొగ పీల్చుకున్న వారిలో 20 శాతం మంది అస్వస్థతకు గురవుతున్నారు.  

విదేశాల్లో ఇలా.. 
అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లాడ్‌ తదితర విదేశాల్లో ఆస్పత్రి వ్యర్థాలను పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీవ వ్యర్థాల వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాదకర రసాయనాలు, ఇతర ఉద్గారాలు గాలిలో కలువకుండా ఎప్పటికప్పుడు దహనం చేస్తున్నారు. వ్యర్థాలను వేర్వేరు డబ్బాల్లో నింపి వాటిని నిర్వహణ కేంద్రాలకు జాగ్రత్తగా తరలిస్తున్నారు.

అక్కడ ఆటో క్లీనింగ్, మైక్రోవేవింగ్, కెమికల్‌ ట్రీట్‌ మెంట్‌ నిర్వహించి వ్యర్థాల్లో బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులు లేకుండా చేస్తున్నారు. ఆ తర్వాత భూమిపై పెద్ద గుంత తీసి వాటిలో పూడుస్తున్నారు. ప్రస్తుతం మన కార్పొరేట్‌ ఆస్పత్రులు ఈ విధానాన్ని సొంతంగా అమలు చేస్తుండగా..మిగతావారు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతోనే అనర్థాలు తలెత్తుతున్నట్లు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  

వ్యర్థాలతో అనర్థాలివే: 

  • హెచ్‌ఐవీ రోగులు వాడిపడేసిన సూదులు, బ్లేడులు ఆరుబయట పడేయడంతో ఇవి ఇతరులకు గుచ్చుకున్నప్పుడు వారికి ఆయా రోగాలు సోకే ప్రమాదం ఉంది. 
  • హెపటైటిస్‌ బి వంటి రోగాలు ప్రబలుతాయి. 
  • చీము తుడిచిన కాటన్‌ను వథాగా పడవేస్తుండడంతో అందులోని ఫంగస్‌ ఇతరులకు వ్యాపిస్తుంది. 
  • ఆస్పత్రి వ్యర్థాల్లోని బ్యాక్టీరియా, వైరస్‌ ఇతరులకు త్వరగా వ్యాపించి జీర్ణకోశ, శ్వాసకోశ, చర్మ వ్యాధులు ప్రబలుతాయి. 

ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు  
రోగుల రక్తంతో తడిసిన దుప్పట్లు, సర్జికల్‌ డ్రెస్సులు నగరంలోని శివారు చెరువుల్లో శుభ్రం చేస్తుండటంతో చెరువుల్లోని నీరు కలుషితమవుతోంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఆస్పత్రులను గుర్తించి, చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేకపోవడంతో పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఇదే అంశంపై ప్రభుత్వానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. అయినా జీవ వ్యర్థాల నిర్వహణ విషయంలో మార్పు కనిపించడం లేదు.  

– ఎం.పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌   

(చదవండి: మద్యం ‘మత్తు’లో ఎవరెవరు?)

మరిన్ని వార్తలు