అంతటా నాగుల పంచమి.. కానీ అక్కడ మాత్రం తేళ్ల పంచమి

14 Aug, 2021 09:10 IST|Sakshi

శుక్రవారం అందరూ నాగుల పంచమి వేడుకలు చేసుకుంటే.. నారాయణపేట జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కందుకూరులో భక్తులు తేళ్ల పంచమి నిర్వహించారు. గ్రామ సమీపంలోని కొండపై కొండమవ్వను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొండపై ఏ చిన్నరాయిని తొలగించినా తేళ్లు కనిపించడంతో పట్టుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపారు. పంచమి నాడు వాటిని చేతితో తాకినా, పట్టుకున్నా, శరీరంపై పాకించినా కుట్టవని భక్తుల నమ్మకం.

తేళ్లను తమ ముఖం, చేతులు, మెడపై వేసుకుంటూ వారు ఆనందపడ్డారు. ఏటా నాగులపంచమి రోజే తేళ్ల పంచమి నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. కాగా తేళ్లను తాకితే మంచి జరుగుతుందని భక్తులు అంటుండగా.. వాతావరణ పరిస్థితులు, వనమూలికల కారణంగా ఆ తేళ్లు కుట్టవని కొందరు విద్యావేత్తలు చెబుతుంటారు.   
– నారాయణపేట 

ప్రాణముందని.. ప్రేమను పంచి
మహబూబ్‌నగర్‌ పట్టణం బండ్లగేరిచౌరస్తాలో.. ఎద్దులు బండిని లాగుతుండగా దాని మీద రైతు నిల్చున్నట్లుగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే, శుక్రవారం అటుగా వెళ్తున్న ఓ ఆవు.. బొమ్మ ఎద్దులు నిజమైనవి అనుకొని ఇలా వాటి వద్దకు వెళ్లి మూగ ప్రేమను పంచడం చూపరులను ఆకట్టుకుంది.  
– ‘సాక్షి’ సీనియర్‌ ఫొటోగ్రాఫర్, మహబూబ్‌నగర్‌

జనసంద్రమైన నాగోబా ఆలయం..
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం శుక్రవారం జనసంద్రంగా మారింది. నాగులపంచమి కావడంతో భారీసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తులకు జొన్నగట్కాతో అన్నదానం చేశారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, సర్పంచ్‌ మెస్రం రేణుక పూజల్లో పాల్గొన్నారు.
– ఇంద్రవెల్లి(ఖానాపూర్‌) 

మరిన్ని వార్తలు