ఎదురేమొచ్చినా తగ్గేదేలే! రాంగ్‌ రూట్లో రయ్‌.. రయ్‌!

30 Jun, 2022 19:03 IST|Sakshi

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. ప్రాణాలతో చెలగాటం

జిల్లాలో పెరుగుతున్న రాంగ్‌రూట్‌ ప్రమాదాలు

‘కరీంనగర్‌ పట్టణంలో నివాసం ఉండే విశ్రాంత ప్రభుత్వ లెక్చరర్‌ పాపారావు దంపతులు ఈనెల 12న పనినిమిత్తం హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. సిద్దిపేట జిల్లా మల్లారం వద్ద రాంగ్‌రూట్లో వస్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. పాపారావు దంపతులతో పాటు కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా విషాదం నింపింది. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తీసింది.’

‘కరీంనగర్‌లోని ఓ కార్ల షోరూంలో పనిచేస్తున్న లక్ష్మణ్‌ అనే వ్యక్తి వారం రోజుల క్రితం భోజనం చేసేందుకు బైక్‌పై ఇంటికి వస్తున్నాడు. కోతిరాంపూర్‌ సమీపంలో రాంగ్‌రూట్లో వస్తున్న మరో బైక్‌ ఇతడిని ఢీకొట్టింది. లక్ష్మణ్‌ తలకు తీవ్రగాయం కాగా.. సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాలకు ముప్పు తప్పింది.’

కరీంనగర్‌క్రైం: నిబంధనలు పాటించండి.. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండంటూ ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా కొందరు వాహనదారుల్లో మార్పురావడం లేదు. రాంగ్‌రూట్లో రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుండడంతో ఎదురుగా వచ్చేవారు అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన దుస్థితి. రద్దీగా ఉండే కరీంనగర్‌ సిటీతో పాటు వేగంగా వాహనాలు దూసుకొచ్చే హైవేల పైనసైతం రాంగ్‌రూట్లలో వెళ్తూ ప్రాణాలు తీస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు జీవితాన్ని చీకటిమయం చేస్తుండగా పోలీసులు, రవా ణాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పురావడం లేదు.

కరీంనగర్‌ పట్టణంలో రాంగ్‌రూట్‌ ప్రాంతాలు
► కల్పన హోటల్‌ నుంచి ఎస్‌బీఐ కమాన్‌ బ్రాంచ్‌ వైపు
► పోచమ్మవాడ నుంచి కమాన్‌ వైపు
► కోతిరాంపూర్‌ చౌరస్తా వద్ద
► విద్యుత్‌ కార్యాలయం, జిల్లా కోర్టు సమీపంలో
ఎస్సారార్‌ కళాశాల సమీపంలో
► బైపాస్‌ ఎన్టీఆర్‌ చౌరస్తా
► ఆదర్శనగర్‌ బోర్డు నుంచి మంచిర్యాల చౌరస్తా వైపు
► రాంనగర్‌ చౌరస్తా.. మంకమ్మతోట
► తెలంగాణ చౌక్‌ ప్రాంతం
(పోలీసులు మొత్తం 12 రాంగ్‌రూట్‌ ప్రాంతాలను గుర్తించారు)

నగరంలో యథేచ్ఛగా..
కొన్నాళ్లక్రితం వరకు నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటుచేసి పలు కూడళ్లవద్ద రాంగ్‌రూట్లలో వెళ్లేవారిపై నిఘాపెట్టేవారు. రాంగ్‌రూట్లలో వెళ్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించేవారికి ఈ– చలాన్లు విధించేవారు. ఇప్పటికీ పలుచోట్ల ఈ పద్ధతి అమలు చేస్తున్నా.. చాలా వరకు కూడళ్ల వద్ద పోలీసు నిఘా కనిపించని పరిస్థితి నెలకొంది.

12 కూడళ్ల వద్ద రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌ ఎక్కువగా ఉంటోంది. రాజామెస్‌ నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం వరకు, కోతిరాంపూర్‌లో, పోచమ్మవాడ నుంచి కమాన్‌వైపు, కల్పన హోటల్‌ నుంచి కమాన్‌ ఎస్‌బీఐ బ్యాంకు వైపు రాంగ్‌రూట్లో ఎక్కువగా వెళ్తున్నారు.

అదే విధంగా మంకమ్మతోట, గీతాభవన్, విద్యుత్‌శాఖ కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రాంగ్‌రూట్లలో వెళ్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడుతుండగా.. సిటీలో మరణాలు తక్కువే.

ఇక మెయిన్‌రోడ్లపై కూడా రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌ ఎక్కువగా ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్‌ జాతీయరహదారిపై రాంగ్‌రూట్లో ఎక్కువ వాహనాలు వెళ్తున్నాయి. కాకతీయ కాలువ, ఇంజినీరింగ్‌ కళాశాలలు, తిమ్మాపూర్‌ నుంచి మొదలుకుని నుస్తులాపూర్‌ వరకు కూడా పలు ప్రాంతాల్లో రాంగ్‌రూట్లలో వెళ్తు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రూట్లో రాంగ్‌రూట్‌ మరణాలు సైతం ఎక్కువే.

నగరంలోని పలుచోట్ల ఏర్పాటుచేసిన డివైడర్లను రాకపోకలకు అనుగుణంగా మార్చాలని, తద్వారా రాంగ్‌రూట్‌ ఇబ్బంది ఉండదని సిటీ ప్రజలు అంటుండగా.. రాంగ్‌రూట్లో వెళ్లే వాహనాలపై నిఘా పెడుతున్నామని, నిత్యం జరిమానా విధిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

రాంగ్‌రూట్‌.. వెరీ డేంజర్‌
రాంగ్‌రూట్లో వెళ్లకుండా పోలీసులు, రవాణాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా తీరుమారడం లేదు. రోజురోజుకు రాంగ్‌రూట్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ రెండు,మూడు నెలల్లోనే రాంగ్‌రూట్‌ ప్రమాదాలు జిల్లాలో 20కి పైగా చోటుచేసుకున్నాయి. జరిమానాలు విధించినా తీరు మార్చుకోవడం లేదని పోలీసులు చెబుతున్నారు. యువత మద్యం మత్తులో రాంగ్‌రూట్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కరీంనగర్‌ సిటీతో పాట జిల్లావ్యాప్తంగా రాంగ్‌రూట్లో వెళ్లేప్రాంతాలను పోలీసులు, రవాణా అధికారులు గుర్తించి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు