బుల్లెట్‌ రీమోడలింగ్‌లో యువకుడి ప్రతిభ

18 Nov, 2020 10:13 IST|Sakshi
బుల్లెట్‌ రీమోడలింగ్‌ చేస్తున్న దృశ్యం, రీమోడలింగ్‌ అనంతరం..

సాక్షి. వైరా రూరల్‌: యూట్యూబ్‌ అతడికి మార్గదర్శిగా నిలిచింది. అందులో నుంచి బుల్లెట్‌లను రీమోడలింగ్‌ చేసే విధానాన్ని నేర్చుకుని.. ఎన్నో పాత బుల్లెట్లను కొత్తగా మార్చాడు. ఈతరం బుల్లెట్ల మాదిరిగానే అవి ఉండటంతో ప్రజల్లో ఆదరణ పెరిగింది. దీంతో ఆ వృత్తినే జీవనోపాధిగా మార్చుకుని “బుల్లెట్‌’లాగా దూసుకుపోతున్నాడు.. వైరాకు చెందిన వజీర్‌. తాను రీమోడలింగ్‌ చేసిన బుల్లెట్ల ఫొటోలు యూట్యూబ్, ఓఎల్‌ఎక్స్‌లలో పెట్టి విక్రయిస్తున్నాడు. ప్రత్యేకంగా ఫేస్‌బుక్‌లో పేజీ రూపొందించి ఫాలోవర్ల సంఖ్యను పెంచుకున్నాడు. యూట్యూబ్‌ చానెల్‌ ఏర్పాటు చేసి ఎందరో సబ్‌స్క్రైబర్లను సాధించాడు. 1994 అంతకంటే ముందు వచ్చిన డీజిల్‌ బుల్లెట్‌ వాహనాలకు రీమోడలింగ్‌ చేసి భవిష్యత్‌లో స్థిరపడాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఇంత వరకు అతను ఎక్కడా షాపు పెట్టలేదు. చదవండి: రాష్ట్రంలో విరివిగా కరోనా పరీక్షలు

ఇలా మొదలైంది.. 
బుల్లెట్‌ వాహనాలకు రీమోడలింగ్‌ చేసే షేక్‌ వజీర్‌ ఏడేళ్ల కిందట టోరస్‌ 1995 మోడల్‌కు చెందిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాన్ని కొనుగోలు చేశాడు. దానిని కొన్ని రోజులు నడిపిన తర్వాత ఆ బైక్‌ రిపేర్‌కు వచ్చింది. దానికి మరమ్మతులు చేయించేందుకు చాలా షాపులు తిరిగాడు. కానీ ఏళ్ల కిందట బుల్లెట్‌ కావడంతో రిపేర్‌ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 1994 కంటే ముందు మోడల్‌ డీజిల్‌ బుల్లెట్లకు అప్పటి మెకానిక్‌లు ఆర్డీఓ అప్రూవల్‌తో పెట్రోల్‌ వాహనాలుగా మాత్రమే కన్వర్షన్‌ చేసేవారు తప్ప రిపేర్‌ మాత్రం చేసే వారు కాదు. ఇలాంటి బైక్‌లను మరమ్మతు చేయడం నేర్చుకుంటే జీవితంలో స్థిరపడవచ్చనే అనే ఆలోచన అప్పుడు అతడికి వచ్చింది. 

యూట్యూబ్‌ ద్వారా 
గుంటూరులో మాత్రమే ఇంజిన్‌ రిపేర్‌ చేసే వారు ఉంటారని తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి ఇంజిన్‌ రీపేర్‌ చేయడం, అమర్చడం నేర్చుకున్నాడు. యూట్యూబ్‌ ద్వారా వాహనంలోని వివిధ భాగాలు వీడదీయడం, వాటిని అమర్చడం నేర్చుకున్నాడు. తాను కొనుగోలు చేసిన బుల్లెట్‌పై ప్రయోగం చేసి సత్ఫలితం సాధించాడు. షాపు పెట్టుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో యూట్యూబ్‌లో చానల్‌ రూపొందించాడు. తాను రీమోడలింగ్‌ చేసే ప్రతి వావాహనాన్ని అందులో ఆప్‌లోడ్‌ చేసి ప్రపంచమంతా వీక్షించే విధంగా దానిని రూపకల్పన చేశాడు. 

కుంగిపోకుండా..
వజీర్‌ ఎంబీఏ చేసి ఏదైనా ఉద్యోగంలో స్థిరపడాలని కోరిక. డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు తప్పడంతో తన తండ్రి సైదులుకు ఉన్న చికెన్‌ షాపులో పని చేసుకుంటూ.. చదువుకునే వాడు. ఈ క్రమంలో తన తండ్రి మత్స్యకారుడు కూడా కావడంతో సుమారు ఆరేళ్ల కిందట చేపల వేటకు వెళ్లి ఈదురు గాలులకు రిజర్వాయర్‌లో గల్లంతై మృతిచెందాడు. దీంతో కుటుంబ భారం మొత్తం ఇతడిపై పడడంతో చదువును మధ్యలోనే ఆపేశాడు. తండ్రి మృతి తర్వాత చికెన్‌ షాపులో కూడా వ్యాపారం తగ్గడంతో.. అతడికి తెలిసిన చికెన్‌ షాపులో పనిచేస్తూ.. అన్ని తానై తన చెల్లి వివాహం చేశాడు. ప్రస్తుతం కొణిజర్లలో చికెన్‌ షాపు పార్ట్‌టైంగా నిర్వహిస్తూ.. ఇంట్లో బుల్లెట్‌ రీమోడలింగ్‌ చేస్తున్నాడు. 

ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే.. 
డీజిల్‌ బుల్లెట్లు 1996 తర్వాత పూర్తిస్థాయిలో బ్యాన్‌ అయ్యా యి. కానీ, వాటి క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. కారణం ఈ ద్విచక్రవాహనం లీటర్‌ డీజిల్‌కు 70 కిలోమీటర్ల మైలేజ ఇస్తాయి. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఓఎల్‌ఎక్స్‌ల ద్వారా నాటి బుల్లెట్లు ఎక్కడ దొరకుతాయో.. తెలుసుకొని అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఉంటే.. వాటిని కొనుగోలు చేస్తాడు. అనంతరం దాని భాగాలు మొత్తం పూర్తి స్థాయిలో వీడదీసి, దానికి కావా ల్సిన స్పేర్‌ భాగాలను కొని మొత్తం ఫిట్టింగ్‌ అంతా పూర్తి చేస్తాడు. నూతన సీట్లు కావాలంటే వాటిని సైతం తయారు చేస్తాడు. పెయింటింగ్, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అనే స్టిక్కర్‌ కూడా వేస్తాడు. మొత్తం రీమోడలింగ్‌ అయిన తర్వాత తన సోషల్‌ మీడియా ద్వారా విక్రయానికి సిద్ధం చేస్తాడు. ఇలా ఇప్పటికే ఎన్నో బుల్లెట్లను రీమోడలింగ్, రీస్టోర్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు