పోచంపల్లి పీహెచ్‌సీకి జాతీయ స్థాయి గుర్తింపు

4 Nov, 2021 01:51 IST|Sakshi

నేషనల్‌ క్వాలిటీ అనాలసిస్‌ బృందం పరిశీలన 

భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. కార్పొరేట్‌ ఆస్పత్రులకు ఏ మాత్రం తీసిపోకుండా రోగులకు నాణ్యమైన వైద్యసేవలందిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల నేషనల్‌ క్వాలిటీ అనాలసిస్‌కు చెందిన కేంద్ర ప్రతినిధుల బృందం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. 

జాతీయ స్థాయి ఎంపిక ఇలా..  
జాతీయ వైద్య ఆరోగ్య సంస్థ చేపట్టిన 14 రకాల కార్యక్రమాల అమలు, ఆస్పత్రి పరిపాలనా విభాగం పనితీరు, వివిధ ఆరోగ్య పరీక్షల నిర్వహణ–నాణ్యత, రోగులకు అందిస్తున్న సేవలు, రికార్డులు–ఫార్మసీ నిర్వహణ, డెలివరీ ప్రొటోకాల్స్, అనంతరం తల్లీబిడ్డలకు అందిస్తున్న సేవలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని ప్రమాణాలు పాటించిన పీహెచ్‌సీలను జాతీయస్థాయి క్వాలిటీ అస్యూరెన్స్‌ ఇస్తారు.

కాగా పోచంపల్లి పీహెచ్‌సీ, పరిధిలోని 9 హెల్త్‌ సబ్‌సెంటర్ల ద్వారా మండలంలోని 52వేల మందికి వైద్య సేవలందిస్తున్నది. గర్భిణులు, పిల్లలకు ఇమ్యునైజేషన్‌ విజయవంతంగా నిర్వహిస్తున్నది. జిల్లాలో అత్యధికంగా ఒక్క ఏడాదిలో పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 750 సాధారణ ప్రసవాలు జరిగాయి. ఇలా జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాలతో పనిచేస్తున్నందుకుగాను పోచంపల్లి పీహెచ్‌సీకి జాతీయ స్థాయి లభించింది.

అదనపు నిధులు వస్తాయి  
పోచంపల్లి పీహెచ్‌సీ 2017లో ‘కాయకల్ప’అవార్డుకు ఎంపికైంది. గతంలో పీహెచ్‌సీని సందర్శించిన స్టేట్‌ క్వాలిటీ అనాలిసిస్‌ బృందం, నేషనల్‌కు ప్రతిపాదనలు పంపడంతో కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఇలా జాతీయస్థాయికి ఎంపికైన పీహెచ్‌సీకి ఏటా రూ.2లక్షల నుంచి 3లక్షల వరకు అదనపు నిధులు వస్తాయి.  
–డాక్టర్‌ యాదగిరి, మండల వైద్యాధికారి  

మరిన్ని వార్తలు