యాదాద్రితో ప్రణబ్‌కు అనుబంధం 

1 Sep, 2020 12:37 IST|Sakshi
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఆశీస్సులు అందజేస్తున్న ఆలయ అర్చకులు (ఫైల్‌)

సాక్షి, యాదాద్రి: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతో అనుబంధం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రాష్ట్రపతి హోదాలో రాజముద్ర వేసిన ఆయనను సీఎం కేసీఆర్‌ యాదాద్రికి ఆహ్వానించారు. దీంతో ఆయన 2015జూలై 5వ తేదీన యాదగిరిగుట్ట దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని, మెమెంటోను సీఎం కేసీఆర్‌ స్వయంగా బహూకరించారు. యాదాద్రి దేవస్థానంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రధానాలయం, ఇతర అభివృద్ధి పనులపై సీఎం వివరించారు. ఆలయ ప్రాశస్త్యాన్ని అర్చకులు ప్రణబ్‌ముఖర్జీకి వివరించారు. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంలో వెలసిన యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి మహిమగలిగిన దేవుడని ప్రణబ్‌ ముఖర్జీ కొనియాడారు. రాష్ట్రపతి వెంట ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జి. జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడిసునీతామహేందర్‌రెడ్డి, అప్పటి ఎంపీ డాక్టర్‌ బూరనర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్లశేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, దేవాలయ ఈఓ గీతారెడ్డిలు ఉన్నారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి చెందిన వార్తతో స్థానికంగా ఆచార్యులు, ప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.    

మరిన్ని వార్తలు