నృసింహస్వామి పెండ్లికొడుకాయెనే..

28 Feb, 2023 03:05 IST|Sakshi

వైభవోపేతంగా ఎదుర్కోలు మహోత్సవం 

నేడు తుల లగ్న ముహూర్తంలో శ్రీస్వామివారి కల్యాణోత్సవం 

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి శ్రీస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవాన్ని ఆలయ ఆచార్యులు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఉదయం ప్రధానాలయ మాఢ వీధుల్లో శ్రీస్వామివారు జగన్మోహిని అలంకార సేవలో..సాయంత్రం అశ్వవాహనంపై పెండ్లి కొడుకుగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై అమ్మవారిని ఆలయ మాఢవీధిలో ఊరేగించారు.  

గజవాహనంపై కల్యాణోత్సవానికి... 
శ్రీనృసింహస్వామికి లక్ష్మీదేవితో వివాహం చేసేందుకు మూహుర్తాన్ని ఆచార్యులు నిర్ణయించారు. మంగళవారం రాత్రి తుల లగ్నం ముహుర్తంలో 9.30గంటలకు బ్రహ్మోత్సవ మండపంలో శ్రీస్వామి వారు అమ్మవారికి మాంగళ్యధారణ చేయనున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీస్వా మి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.  

మరిన్ని వార్తలు