యాదాద్రీశుడి దర్శనానికి 3 గంటలు

9 Oct, 2022 01:52 IST|Sakshi
కొండపై బస్‌బే వద్ద భక్తుల రద్దీ, కొండ కింద వాహనాలతో నిండిపోయిన పార్కింగ్‌ స్థలం

22,776 మంది భక్తుల రాక

ట్రాఫిక్‌ జామ్, భక్తుల ఇబ్బందులు

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, ప్రసాదం కౌంటర్, క్యూలైన్లు, ఘాట్‌ రోడ్డు.. ఇలా ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ధర్మదర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

రూ.150 టికెట్‌ దర్శనం క్యూలైన్‌ సరిగ్గా లేకపోవడంతో భక్తులు అష్టభుజి ప్రాకార మండపంలో బారులు దీరారు. టికెట్‌ కొనుగోలు కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్వామి వారిని 22,776 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ విభాగాల నుంచి నిత్యాదాయం రూ.40,29,719 వచ్చినట్లు వెల్లడించారు. భక్తులు భారీగా తరలిరావడంతో రింగ్‌రోడ్డు, కొండపైన ఘాట్‌ రోడ్డు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. కొండపైన పార్కింగ్‌ స్థలం కిక్కిరిసిపోవడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొండ కింద ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ పూర్తిగా వాహనాలతో నిండిపోయింది.  

మరిన్ని వార్తలు