ప్రతీ భక్తుడికి జియో ట్యాగింగ్‌

19 Mar, 2022 01:35 IST|Sakshi
మాట్లాడుతున్న ఈవో గీతారెడ్డి  

యాదాద్రిలో కొత్తగా ఆన్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటు 

28న ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ  

మధ్యాహ్నం 2 గంటల తరువాతే స్వయంభూ దర్శనాలు 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 28న వస్తారు

చినజీయర్‌ స్వామి వచ్చే అంశం సీఎం చూసుకుంటారు.. 

ఆలయ ఈవో గీతారెడ్డి 

యాదగిరిగుట్ట: యాదాద్రీశుడికి ఈనెల 28న ఉదయం 11.55 గంటలకు మహా కుంభసంప్రోక్షణ జరుగుతుందని, ఆ రోజు మధ్యాహ్నం 2గంటల తరువాతే భక్తులకు స్వయంభూ దర్శనాలు కల్పిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి చెప్పారు. ‘ఉదయం సమయంలో భక్తులు వచ్చి ఇబ్బందులు పడొద్దు.. పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎవరినీ ఆలయంలోకి అనుమతించడం కుదరదు.

పూజలన్నీ పూర్తయ్యాక మధ్యాహ్నం 2గంటల తర్వాతే స్వయంభూ దర్శనాలు ప్రారంభమవుతాయి’అని ఆమె వెల్లడించారు. శుక్రవారం కొండపైన తన కార్యాలయంలో ఈఓ గీతారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ‘భక్తులు క్యూకాంప్లెక్స్‌లోకి వెళ్లే క్రమంలో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత దర్శనమైనా, వేరే ఏ దర్శనమైనా అక్కడ భక్తులు పేరు నమోదు చేసుకుంటారు.

కొండపైకి ఎంత మంది వచ్చారు, క్యూలైన్‌లో ఎంత మంది ఉన్నారో పరిశీలించేందుకు జియో ట్యాగింగ్‌ చేస్తున్నాం. ఒక్కసారి ట్యాగింగ్‌ చేసిన వ్యక్తి కొండ దిగారా లేదా ఎక్కడ ఉన్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. 28న ఉచిత దర్శనాలే ఉంటాయి కాబట్టి 29వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది’ అని చెప్పారు. కొండపైకి భక్తులు వచ్చేందుకు 75 బస్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. 

27 వరకు బాలాలయంలో దర్శనాలు  
ఈ నెల 21న అంకురార్పణతో బాలాలయంలో ప్రారంభమయ్యే పంచకుండాత్మక కార్యక్రమాలు 28 వరకు జరుగుతాయి. 28న ఉదయం పూర్ణాహుతి పూర్తయిన అనంతరం మహా కుంభ సంప్రోక్షణ ఉంటుంది. పంచకుండాత్మక యాగానికి సంబంధించిన పనులన్నీ శనివారం పూర్తవుతాయి. ‘బాలాలయంలో 27వ తేదీ వరకు స్వామి వారి దర్శనాలు ఉంటాయి.

21 నుంచి వచ్చే భక్తులంతా స్వామి వారిని, యాగాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. 28న ఉదయం పూర్ణాహుతి, యాగ ఫలం సమర్పించిన అనంతరం బాలాలయంలో ఉన్న సువర్ణ మూర్తులను శోభయాత్రతో ప్రధానాలయానికి తీసుకెళ్తారు. ఆ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు’అని ఆమె తెలిపారు. యాగశాల, మహా కుంభసంప్రోక్షణకు అవసరమైన వేద పారాయణీకులు, ఇతర ఆలయాల్లో ఉన్న అర్చక సిబ్బంది డిప్యూటేషన్‌పై యాదాద్రికి వస్తారన్నారు. 

సౌకర్యాలన్నీ 28న ప్రారంభం 
‘మండల దీక్ష భవనం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణిని 28న ప్రారంభిస్తాం. శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం సైతం భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వీలైనంత వరకు అదే రోజు ప్రారంభిస్తాం. కొండపైన క్యూకాంప్లెక్స్‌ సిద్ధంగా ఉంది. కొండ కింద బస్టాండ్, కొండపైన బస్‌బే రెడీ అవుతున్నాయి. 21 నుంచి 28 వరకు ఎంత మంది వస్తే అంత మంది భక్తులకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు అన్న ప్రసాదం అందిస్తాం’అని గీతారెడ్డి చెప్పారు.

28వ తేదీ నుంచి మూడు రోజులపాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తర్వాత ప్రతి శనివారం, ఆదివారం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు శ్రీస్వామి వారి కల్యాణ మండపం కింద ప్రత్యేక వేదిక నిర్మించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం చెంతనే గల శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ప్రధానాలయం ఉద్ఘాటన ఏప్రిల్‌ 25న ఉంటుందన్నారు.  

అందరూ ఆహ్వానితులే.. 
‘శ్రీస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనకు శ్రీత్రిదండి చినజీయర్‌ స్వామి వచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్‌ చూసుకుంటారు. మేము ఎవరికీ ప్రత్యేకంగా ఆహ్వానం ఇవ్వలేదు. సీఎం కేసీఆర్‌ మాత్రం 28వ తేదీన ఉదయం జరిగే మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొంటారు. దేవుడికి ప్రత్యేకంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి అందరూ ఆహ్వానితులే. యాగం జరిగే సమయంలో ఎవరైనా, ఏ సమయంలోనైనా వచ్చి వెళ్లవచ్చు. వచ్చిన వారికి ఆలయ పరంగా మర్యాదలు చేస్తాం’ అని గీతారెడ్డి చెప్పారు.  

మరిన్ని వార్తలు