‘యాదాద్రి’ వెలవెల..!

10 Sep, 2020 11:17 IST|Sakshi

యాదగిరిగుట్ట (ఆలేరు): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాల ఆలయంలో ఆచార్యులు బుధవారం ఆస్థానపరమైన పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంతో పాటు యాదాద్రి క్షేత్రంలో కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో  శుక్రవారం వరకు భక్తులకు శ్రీస్వామి దర్శనాలను ఆలయ అధికారులు నిలిపివేశారు. ముందస్తుగా సమాచారం లేకపోవడంతో చాలా మంది భక్తులు ఆలయ ఘాట్‌ దారి వద్దకు వచ్చి దర్శనాలు నిలిపివేశారని పోలీస్‌ సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. దీంతో ఆలయ పరిసరాలు బోసిబోయాయి.

ఆస్థాన పరంగా పూజలు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి బుధవారం ఆచార్యులు ఏకాంతంగా, ఆస్థానపరంగా నిత్య పూజలను కొనసాగించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన ఆచార్యులు సుప్రభాత సేవ చేపట్టిన ప్రతిష్ఠామూర్తులకు అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఇక ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. అనంతరం యాదాద్రీశుడికి శ్రీసుదర్శన నారసింహ హోమం చేపట్టారు. సాయంత్రం ఆలయంలోనే సేవను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి వారికి నివేదన జరిపించి శయనోత్సవం నిర్వహించారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఆలయంలోకి భక్తులను రానివ్వకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.

వైకుంఠద్వారం వద్ద మొక్కులు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి భక్తులను అనుమతించకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీస్వామి దర్శనానికి వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. మొదటిఘాట్‌ రోడ్డు నుంచి వెనుదిరిగిన భక్తులు స్థానికంగా ఉన్న వైకుంఠద్వారం వద్ద టెంకాయలు కొట్టి భక్తులు మొక్కులు తీర్చుకొని వెళ్లిపోయారు.

నేటి నుంచి గుట్ట పట్టణం లాక్‌డౌన్‌..
యాదగిరిగుట్ట మున్సిపాలిటీని స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ చే స్తున్నట్లు ఇప్పటికే మున్సిపల్‌ చైర్మన్‌ ఎరుకల సుధా హేమేందర్‌గౌడ్‌ ప్రకటించారు. పట్టణంలో కోవిడ్‌ కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కరోనాను కట్టడి చేయడానికి గురువారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు పట్టణాన్ని సంపూర్ణంగా లాక్‌డౌన్‌ చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం  12గంటల వరకు నిత్యావసర దుకాణాలు తెరుస్తామని పేర్కొన్నారు.

కల్యాణ మండపం పనులు వేగిరం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అభివృద్ధి చెందుతున్న అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ పనులు వేగంగా జరుగుతున్నాయి. శివాలయానికి ఆలయానికి ఉత్తర ప్రాకార మండపం పక్కన నిర్మాణం చేస్తున్న స్వామి వారి కల్యాణ మండపం ఇప్పటికే ఫిల్లర్లు నిర్మించారు. మరో రెండు రోజుల్లో కల్యాణ మండపానికి స్లాబ్‌ వేసే పనులు చేయనున్నారు.

పనులు వేగవంతం చేయాలి: వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు
యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు అధికారులకు సూచించారు. బుధవారం ఆలయ ఈఓ గీతారెడ్డితో కలిసి పనులను పరిశీలించారు. తూర్పు రాజగోపురం సమీపంలోని బ్రహ్మోత్సవ మండపం వద్ద కొనసాగుతున్న స్టోన్‌ ఫ్లోరింగ్‌ పనులను చుశారు. తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం నుంచి యాదాద్రి క్షేత్రానికి తీసుకొచ్చిన శంకు, చక్ర, నామాలు, ఏనుగులు, గరుత్మంతుల విగ్రహాలతోపాటు ప్రధాన ఆలయంలోని ఆళ్వారు పిల్లర్లు, అద్దాల మండపం పనులను పరిశీలించారు. అనంతరం శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వస్వామి ఆలయాలు, ప్రసాదం కాంప్లెక్స్‌లో నిర్మాణం జరుగుతున్న కౌంటర్లను చూసి, పలు సూచనలు, సలహాలు చేశారు.

రాజగోపురం వద్ద ఉన్న విగ్రహాలు  
నలు దిశలా.. భక్తులను ఆకర్షించే విధంగా..

  •     ఆలయంలో ప్రాకారాల్లో విగ్రహాల ఏర్పాటుకు కసరత్తు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయానికి నలు దిశల కృష్ణ శిలతో తయారు చేసిన వివిధ దేవతామూర్తులు, అబ్బుర పరిచే విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు శిల్పులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులోని మహాబలిపురం నుంచి యాదాద్రి కొండపైకి చేరుకున్న గరుఢ్మంతులు, ఐరావతాలు, సింహాల విగ్రహాలను ఆలయానికి నలు దిశలు అమర్చేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇందుకు సంబంధించి తూర్పు రాజగోపురం వద్ద ఉన్న ఈ విగ్రహాలను బుధవారం ప్రధాన ఆలయంలోకి చేర్చారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ రాజగోపురాలకు ముందు భాగంలో ఏనుగుల విగ్రహాలు, ఆలయంలోకి భక్తులు ప్రవేశించే మార్గాల్లో సింహాల విగ్రహాలు, ఇక ఆలయానికి ప్రాకార మండపాలపై గరుఢ్మంతుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు శిల్పులు సన్నద్ధం అవుతున్నారు.

మరిన్ని వార్తలు