అద్భుతం.. అద్దాల మండపం

2 Sep, 2020 05:57 IST|Sakshi
బంగారు వర్ణంలో అద్దాల మండపం ( ఊహాచిత్రం)

బంగారు వర్ణంలో రూపు దిద్దుకుంటున్న మండపం  

వీడియోను విడుదల చేసిన ఆలయ అధికారులు

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పడమటి రాజగోపురం సమీపంలోని ఇన్నర్‌ ప్రాకార మండపం నైరుతి దిశలో నిర్మాణమవుతున్న అద్దాల మండపం క్షేత్రానికి వచ్చే భక్తులను మరింత ఆకర్షించనుంది. ప్రస్తుతం అద్దాల మండపంలో విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. అద్దాల మండపానికి సంబంధించిన ఓ వీడియోను ఆలయ అధికారులు మంగళవారం విడుదల చేశారు.

పూర్తి స్థాయిలో బంగారు వర్ణంతో కూడిన అద్దాల మండపంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు ఊయలలో ఊగుతున్నట్లు కనిపిస్తున్నారు. సుమారు 123 ఇంచుల ఎత్తు, నాలుగు దిక్కుల 60 ఫీట్ల చుట్టు వెడల్పుతో అద్దాల మండపం నిర్మాణమవుతోంది. మండపానికి ముందు భాగంలో రెండు నల్లరాతితో చెక్కిన ఏనుగులను ఏర్పాటు చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ మండపానికి ప్రధాన ఆకర్షణీయంగా బంగారం వర్ణంలో దర్వాజాల ముందు భాగంలో ఆళ్వార్‌ చిత్రాలను రూపొందించారు.  
 

మరిన్ని వార్తలు