బ్రహ్మోత్సవాలలోపే యాదాద్రి ప్రారంభం?

29 Dec, 2020 02:57 IST|Sakshi

జనవరి చివరిలోగా ప్రధానాలయంలో లక్ష్మీనారసింహుని దర్శనం! 

ఇప్పటికే నిర్మాణం దాదాపు పూర్తి 

గుట్ట దిగువ మిగిలిన పనుల్లో వేగం 

కల్యాణకట్ట, గుండం వద్ద తాత్కాలిక ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: బ్రహ్మోత్సవాలకు ముందే యాదాద్రి ప్రధానాలయం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరిలో యాదాద్రి లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈలోపు ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించాలని భావిస్తున్నారు. పది రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులకు కొన్ని ప్రత్యేక సూచనలు చేశారు. 45 రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి, ప్రధాన ఆలయం ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జనవరి ఆఖరు లోపు పనులు పూర్తి చేసే దిశగా అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలైనప్పటి నుంచి స్వామివారు గుట్ట దిగువన బాలాలయంలో దర్శనమిస్తున్నారు. అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలాఖరులో ప్రధానాలయానికి తరలి అక్కడే భక్తజనానికి దర్శనమివ్వనున్నారు.  

అక్కడ తాత్కాలిక ఏర్పాట్లతో..
ప్రస్తుతం ప్రధాన దేవాలయం పనులన్నీ పూర్తయ్యాయి. దిగువన చేపట్టిన అభివృద్ధి పనులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. రింగురోడ్డు, కల్యాణకట్ట, గుండం, ప్రెసిడెన్షియల్‌ సూట్లు.. తదితర పనులు జరుగుతున్నాయి. సీఎం నిర్దేశించిన గడువులోగా ఇవి పూర్తి కావు. వీటిలో రింగురోడ్డుకు సంబంధించి.. గాలిగోపురం వద్ద అడ్డుగా ఉన్న కొన్ని ఇళ్లు తొలగించాల్సి ఉంది. అక్కడి వారికి పునరావాసం కల్పించాకే వాటిని తొలగించాలని ఆదేశాలు అందాయి. ఇక దిగువన ప్రత్యేకంగా నిర్మిస్తున్న కల్యాణకట్ట, గుండం పనులు అనుకున్న గడువులోగా పూర్తయ్యేలా లేవు. దీంతో జనవరి లోపు తా త్కాలికంగా అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రెసిడెన్షియల్‌ సూట్లు దాదాపు సిద్ధం కానున్నాయని అధికారులు చెబుతున్నా రు. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో మరోసారి పరిశీలించి ఆలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని తేదీలు అనుకుంటున్నారు. వాటిల్లో ఏది ఖరారు అవుతుందనే దానిపై అధికారులకు ఇంకా స్పష్టత రాలేదు. సీఎంవో నుంచి వచ్చే సూచనల ఆధారంగా తాము ఏర్పాట్లు చేస్తామని వారు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు