యాదాద్రీశుడికి కలిసొచ్చిన కార్తీక మాసం.. ఆదాయం రెండింతలు!

24 Nov, 2022 19:08 IST|Sakshi

గతేడాది కంటే ఈసారి డబుల్‌ ఆదాయం

రెండు ఆదివారాలు రికార్డు స్థాయిలో నిత్యాదాయం

యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయానికి ఈ కార్తీక మాసం కలిసొచ్చింది. గతేడాది కార్తీక మాసంతో పోల్చుకుంటే ఈసారి అన్ని విభాగాల ద్వారా ఆదాయం డబుల్‌ అయింది. చివరి రెండు ఆదివారాలు భక్తులు 50వేల కంటే ఎక్కువగా వచ్చి స్వామిని దర్శించుకోవడంతో నిత్యా ఆదాయం సైతం రికార్డు స్థాయిలో వచ్చింది. ఇక సత్యనారాయణస్వామి వ్రతాలు సైతం ఈసారి అధికంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఈఓ గీతారెడ్డి బుధవారం రాత్రి వెల్లడించారు. 


ఆదాయం రెండింతలు..

గతేడాది కార్తీక మాసంలో రూ.7,35,10,307 ఆదాయం రాగా, ఈసారి రూ.14,66,38,097 ఆదాయం వచ్చింది. యాదాద్రి ప్రధానాలయం మార్చి 28న ప్రారంభమైన తర్వాత క్షేత్రానికి భక్తులు రాక అధికంగా పెరిగింది. స్వయంభూ దర్శనం పునఃప్రారంభం అయిన తరువాత మొదటిసారి వచ్చిన కార్తీక మాసం కావడంతో స్వామివారికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. 


వ్రతాలతో రూ.1.71కోట్లు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తర్వాత యాదాద్రిలోనే భక్తులు అధికంగా సత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఈ కార్తీక మాసంలో 21,480 సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించగా రూ.1,71,84,000 ఆదాయం చేకూరినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది బాలాలయం ఉన్న సమయంలో 19,176 వ్రతాలు మాత్రమే జరిపించారు.


రికార్డు స్థాయిలో నిత్యాదాయం..

కార్తీకమాసం చివరి రెండు ఆదివారాలు 50వేలకు పైగానే భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నెల 13న ఆదివారం రోజున స్వామి వారికి రూ.1,09,82,446 నిత్య ఆదాయం రాగా, 20న ఆదివారం రోజున రూ.1,16,13,977 నిత్య ఆదాయం వచ్చింది. కార్తీక మాసం చివరి ఆదివారం వచ్చిన ఆదాయమే ఆలయ చరిత్రలో అధికమని అధికారులు వెల్లడించారు.  (క్లిక్ చేయండి: ప్రధాన టెర్మినల్‌ నుంచే విమాన సర్వీసులు)

మరిన్ని వార్తలు