2022 Roundup: హైదరాబాద్‌లో మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఈ ఏడాదిలోనే ఎన్ని కేసులంటే!

26 Dec, 2022 10:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మహిళల భద్రత, రక్షణే ప్రథమ కర్తవ్యం’ ఇదీ రాష్ట్ర పోలీసు యంత్రాంగం నినాదం. కానీ, ఇది ఆచరణలో ఆమడదూరంలో ఉంది. ఇంటా బయటా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్ని చట్టాలు, శిక్షలు అమలు చేస్తున్నా స్త్రీలకు భద్రత కరువైంది. గృహ హింస, అత్యాచారం, హత్యలు, వరకట్న మరణాలు, అపహరణలు ఇలా ఎన్నెన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏటా మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది గ్రేటర్‌లో మహిళలపై 7,459 నేరాలు జరగ్గా... ఈ ఏడాది 7,578 నేరాలు నమోదయ్యాయి.

అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడుతున్న ఈ రోజుల్లో కూడా స్త్రీలపై గృహ హింసలు, వేధింపులే జరగడం బాధాకరం. ఏటేటా ఈ తరహా కేసులు పెరుగుతుండటం గమనార్హం. గతేడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లలో కలిపి 4,674 వేధింపుల కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 4,891లకు పెరిగాయి. అయితే అత్యాచారాలు, పోక్సో కేసులు కాస్తా తగ్గుముఖం పట్టాయి. 2021లో 1,089 అత్యాచారాలు జరగ్గా.. ఈ ఏడాది 984లకు తగ్గాయి. అలాగే గతేడాది చిన్నారులపై 1,161 అఘాయిత్యాలు జరగగా.. ఈ ఏడాది 1,052 పోక్సో కేసులు నమోదయ్యాయి. 

తెలిసినోళ్లే తోడేళ్లు.. 
ఈ ఏడాది రాచకొండలో 372 అత్యాచారాలు జరగగా.. ఇందులో స్నేహితులు, కుటుంబ సభ్యులు రేప్‌ చేసిన సంఘటనలే ఎక్కువ. స్నేహితులు రేప్‌ చేసిన కేసులు 352 కాగా.. చుట్టుపక్కల వాళ్లు 4, కుటుంబ సభ్యులు 2 రేప్‌ కేసులున్నాయి. ఇతరుల చేసిన అత్యాచార కేసులు 14 ఉన్నాయని వార్షిక నివేదికలో వెల్లడైంది. సైబరాబాద్, హైదరాబాద్‌తో పోలిస్తే ఈ ఏడాది రాచకొండలో పోక్సో కేసులు ఎక్కువయ్యాయి. గతేడాది 394 పోక్సో కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 442కు పెరిగాయి. 

పోకిరీల భరతం.. 
విద్యా సంస్థలు, కార్యాలయాలు, బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధిస్తున్న ఆకతాయిల భరతం పడుతుంది షీ టీమ్స్‌. ఈ ఏడాది 7,521 మంది పోకిరీలను మూడు కమిషనరేట్ల షీ టీమ్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆయా నిందితులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. రెండోసారి పోలీసులకు చిక్కిన ఆకతాయిలపై ఎఫ్‌ఐఆర్‌లు, పెట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది రాచకొండలో 176 మంది పోకీరీలపై ఎఫ్‌ఆర్‌లు, 195 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. అలాగే హైదరాబాద్‌లో 137 మందిపై ఎఫ్‌ఆర్‌లు, 426 మందిపై పెట్టీ కేసులు, సైబరాబాద్‌లో 82 మందిపై ఎఫ్‌ఆర్‌లు, 1,306 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు