2022 Roundup-Hyderabad: ఓ బాట‘సారీ’! 

27 Dec, 2022 13:06 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ సిటీ... పాదచారులకు మాత్రం పిటీ. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు, కనిపించని మౌలిక వసతులే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. నగరంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గత ఏడాది నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో బాధితులుగా మారిన వారిలో పెడ్రస్టియన్స్‌ పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రాథమిక అంశాలైన ఫుట్‌పాత్‌లు మాయం కావడం, అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ పెలికాన్‌ సిగ్నల్స్‌తో పాటు జీబ్రా క్రాసింగ్స్, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు లేకపోవడం... ఉన్న వాటిని పాదచారులు, వాహనచోదకులు పట్టించుకోక పోవడం వల్లే ఈ దుస్థితి దాపురించింది.

రెండో స్థానంలో పాదచారులు... 
నగర ట్రాఫిక్‌ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారు ఎవరెవరు అనేది గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. ఈ ఏడాదికి సంబంధించి హైదరాబాద్‌ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం సిటీలో చోటు చేసుకున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉన్నాయి.

వీటిలో అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండో స్థానం పాదచారులదే. ఇప్పుడే కాదు... గత కొన్నేళ్లుగా నమోదైన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు.  


వీటికి మోక్షమెప్పుడో? 
రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీలోనే కాదు... ఇటీవలే రూపుదిద్దుకుని, నానాటికీ అభివృద్ధి చెందుతున్న హైటెక్‌ సిటీ పరిసరాల్లోనూ ఇవి మచ్చుకైనా కనిపించవు. ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలోనూ పాదచారులకు అవసరమైన స్థాయిలో ప్రాధ్యానం లభించట్లేదు.

ప్రణాళిక లోపం కారణంగా నగరంలో ఉన్న ఫుట్‌పాత్‌ల్లో సగం ఆక్రమణకు గురికాగా... మిగిలిన చోట్ల అనేక అడ్డంకులు వస్తున్నాయి. నగరంలో కీలక ప్రాంతాల్లో కనీసం రెండడుగుల వెడల్పుతో ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయాలని, దీనికి బారికేడింగ్, అవసరమైన ప్రాంతాల్లో క్రాస్‌ చేసేందుకు ఓపెనింగ్స్‌ తదితరాలతో కూడిన ప్రతిపాదనలకు పూర్తి స్థాయిలో మోక్షం లభించలేదు.  

ఆపరేషన్‌ రోప్‌ పై ఆశలెన్నో... 
ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఈ ఏడాది ఆపరేషన్‌ రోప్‌ (రిమూవల్‌ ఆఫ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్స్‌) అమలులోకి తీసుకువచ్చారు. దీని ప్రకారం పాదచారులకు ఇబ్బందికరంగా మారుతున్న అనేక అంశాలపై దృష్టి పెట్టారు. ఆయా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై సిటీ ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

రోప్‌లో భాగంగా ఇప్పటి వరకు స్టాప్‌ లైన్‌ క్రాసింగ్‌పై 1,74,869, ఫ్రీ లెఫ్ట్‌ బ్లాక్‌ చేయడంపై 27,217, రహదారులు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తదితరాలపై  72,668 కేసులు నమోదు చేశారు. దీన్ని మరింత విస్తరించాలని పోలీసు విభాగం భావిస్తోంది. ఫలితంగా రానున్న రోజుల్లో పాదచారుల పరిస్థితి మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు