ఈసారి అతి తీవ్ర వడగాడ్పులు..

7 Mar, 2021 02:30 IST|Sakshi

అంచనా వేసిన వాతావరణ శాఖ

నేడు, రేపు ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు

సాక్షి, హైదరాబాద్‌: ఈ వేసవిలో ఉష్ణ తీవ్రత అప్పుడే మొదలుకాగా మున్ముందు వడగాడ్పులు సైతం ప్రతాపాన్ని చూపనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్, మేలలో వడగాడ్పులు తీవ్ర స్థాయి నుంచి అతితీవ్ర స్థాయిలో వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఎండలు సాధారణం కంటే ఒక డిగ్రీ సెల్సియస్‌ అధికంగా నమోదు కావొచ్చని తెలిపింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించింది.

మొదటి వారంలోనే 40 డిగ్రీలకు చేరువగా...
సాధారణంగా మార్చిలో వేసవి ప్రారంభమైనప్ప టికీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. ఈ సారి సూర్యప్రతాపం మార్చి తొలి వారంలోనే మొదలైంది. గతేడాది మార్చి నెల మొదటి వారంలో 35.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవగా ఈసారి ఇప్పటికే భద్రాచలంలో 39.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. మరో 4-5 రోజులపాటు ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఒక ట్రెండు డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదవుతాయని, మార్చి మూడో వారం నుంచి ఉష్ణోగ్రతల్లో తేడా కనిపిస్తుందని వాతావరణ శాఖ వివరించింది. ఏప్రిల్, మేలలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వడగాడ్పుల నుంచి అతి తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారి నాగరత్న ‘సాక్షి’కి వివరించారు. రాష్ట్రం లోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఆది, సోమవారాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ బులెటిన్‌లో తెలిపింది.

మరిన్ని వార్తలు