వీటిలో గత పదేళ్ళుగా నియామకాలు లేవు!

31 Mar, 2021 02:31 IST|Sakshi

రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో ఖాళీగా 1,869 అధ్యాపక పోస్టులు

 మూడేళ్ల కిందటే 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆమోదం 

సెర్చ్‌ కమిటీల భేటీ పూర్తయినా వీసీల భర్తీకి లభించని మోక్షం

 ఫలితంగా అధ్యాపకుల భర్తీకి జారీ కాని నోటిఫికేషన్‌

కాంట్రాక్టు సిబ్బందితోనే నెట్టుకొస్తున్న వైనం

 పరిశోధనలు గాలికి... 

హైదరాబాద్‌: ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక నియామకాలకు మోక్షం లభించట్లేదు. కోర్టు కేసులంటూ కొన్నేళ్లు.. ప్రభుత్వ అనుమతుల కోసమంటూ ఇంకొన్నేళ్లు.. తీరా ప్రభుత్వం అనుమతి ఇచ్చాక నిబంధనల రూపకల్పన పేరుతో మరికొన్నేళ్లు.. తరువాత ఎన్నికల కోడ్‌.. ఇలా కారణం ఏదైనా పదేళ్లుగా నియామకాలు జరగట్లేదు. సెర్చ్‌ కమిటీల సమావేశాలు పూర్తయినా వీసీల నియామకాలు జరగకపోవడంతో అధ్యాపకుల పోస్టుల ఖాళీల భర్తీకి ముందడుగు పడట్లేదు. కాంట్రాక్టు సిబ్బందితో నెట్టుకొస్తున్నా ఆశించిన ఫలితాలు రావట్లేదు. ఎంతో కీలకమైన ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో యూనివర్సిటీల్లో పరిశోధన అటకెక్కింది.

లెక్కలు తేల్చిన విద్యాశాఖ...
యూనివర్సిటీల్లోని ఖాళీలు, ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకుల తాజా లెక్కలను విద్యాశాఖ విడుదల చేసింది. దీని ప్రకారం 2021 జనవరి 31 నాటికి 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులుంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. యూనివర్సిటీల్లో కేవలం 968 మందే (34.12 శాతం) రెగ్యులర్‌ ఆధ్యాపకులున్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 129 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉండగా 781 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 682 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు వాటిని భర్తీ చేయకపోవడం గమనార్హం.

ఆరు యూనివర్సిటీల్లో లేని ప్రొఫెసర్లు..
రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్‌ కూడా లేకుండానే శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్‌జీయూకేటీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలు నెట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా శాతవాహన, ఆర్‌జీయూకేటీ, బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీల్లో అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఒక్కరు కూడా లేని దుస్థితి నెలకొంది. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఒక్కరే ఉన్నారు. మెుత్తంగా చూస్తే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్‌ పోస్టులు, 85.82 శాతం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ లెక్కగట్టింది.

చారిత్రక యూనివర్సిటీల్లోనూ భారీగా ఖాళీలే...
వందేళ్లు దాటిన ఉస్మానియా యూనివర్సిటీలో సగానికిపైగా పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. గత పదేళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలను పెద్దగా చేపట్టకపోవడం, వివిధ కారణాలతో పోస్టుల భర్తీని ఉన్నత విద్యాశాఖ వాయిదా వేయడమే ఇందుకు కారణం. ఓయూ తరువాత ఎంతో కీలకమైన కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్‌ ఉండగా అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. జవహార్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) ఇద్దరే అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉన్నారు.

అభివృద్ధిపైనా లేని ధ్యాస..
యూనివర్సిటీల్లో పరిశోధన, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు పెరిగినా యూనివర్సిటీల అభివృద్ధికి ప్రగతి పద్దు కింద నిధులను కేటాయించట్లేదు. ఈసారి కూడా నిర్వహణ పద్దులోనే ఆ మెుత్తాన్ని పెంచింది. గతేడాది రూ. 606.73 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ. 627.28 కోట్లు కేటాయించింది. అయితే అవి వర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి.

   

మరిన్ని వార్తలు