విద్యను పంచుతూ.. ఆదర్శంగా నిలుస్తూ.. సొంత ఇంటిని బడిగా మార్చి..

22 Jun, 2021 07:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చింతలమానెపల్లి(కరీంనగర్‌): అన్నిదానాల్లోకెళ్లా విద్యాదానం గొప్పది అంటారు.. జ్ఞానం సంపాదించడమే కాదు.. జ్ఞానం పంచాలి అనేది పెద్దల మాట. ఈ మాటలు నిజం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు చింతలమానెపల్లి మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన తూమోజు వెంకటేశ్‌. కరోనా కారణంగా విద్యార్థులు చదువులో వెనకబడకుండా ఉచితంగా విద్యనేర్పుతూ అందరి చేత ప్రశంసలు     పొందుతున్నాడు.

ఇంజినీరింగ్‌ చదువుకుని..
ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన వెంకటేష్‌కు ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. దీనికి తోడు అనారోగ్యానికి గురికావడంతో 2019లో స్వగ్రామానికి తిరిగి వచ్చి పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్పడం ప్రారంభించాడు.

ఇంటినే బడిగా మార్చి..
2020లో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో పాఠశాలలు మూతబడ్డాయి. ఈ క్రమంలో విద్యార్థులు చదువుకోవడం మానేసి వీధుల్లో తిరుగుతుండడం గమనించాడు. గ్రామానికి చెందిన పలువురు యువకుల సహకారంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాడు. గ్రామంలో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో విద్యార్థులకు స్థానిక పాఠశాలలో చదువు చెప్పేందుకు సిద్ధమయ్యాడు. సుమారు 80మంది విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధించాడు. సొంతఖర్చులతో పరీక్ష పత్రాలు, బోధనా సామగ్రిని కొనుగోలు చేశాడు.

పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ..
ఈ ఏడాదిసైతం కరోనా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వం తిరిగి లాక్‌డౌన్‌ విధించింది. వేసవి సెలవుల కారణంగా పాఠశాలలు మూసివేశారు. 5, ఆపై తరగతుల విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చేరేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష వివరాలు తెలియజేసి తాను ఉచితంగా బోధిస్తానన్నాడు. నెల రోజులుగా విద్యార్థులకు గురుకుల సిలబస్‌ను బోధించడంతో పాటు మోడల్‌ పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం 13 మంది విద్యార్థులను గురుకుల ప్రవేశ పరీక్షకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు. వీరితో పాటు గ్రామంలోని 25 మంది ఇతర విద్యార్థులకు అవసరమైన మెలకువలు, ప్రావీణ్యాన్ని మెరుగుపర్చుకునే పాఠాలు బోధిస్తున్నాడు.

తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో 
తండ్రి జనార్దన్‌ ఇచ్చిన స్ఫూర్తితోనే విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తున్నట్లు వెంకటేశ్‌ పేర్కొంటున్నాడు. జనార్దన్‌ గత ప్రభుత్వాలు నిర్వహించిన అనియత విద్య, యువజన విద్య లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని, తండ్రి బోధించిన పాఠాలతోనే తాను గురుకుల ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇందారం గురుకుల పాఠశాలలో చదువుకున్నట్లు చెబుతున్నాడు. రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేస్తానని ఆయన వెల్లడిస్తున్నాడు. వెంకటేశ్‌ వద్ద విద్యాబుద్దులు నేర్చుకుంటున్న విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. రానున్న ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు విద్యార్థులు తెలుపుతున్నారు.  

చదవండి: లాక్‌డౌన్‌ ఉల్లంఘనులకు ‘తెలంగాణ’ గుడ్‌న్యూస్‌

మరిన్ని వార్తలు