లవ్‌ ఫెయిల్‌.. ప్రేమించిన యువతి కావాలని రెండేళ్లుగా..

16 Mar, 2023 13:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అప్పట్లో అతడి వయస్సు 17 సంవత్సరాలు. మైనర్‌ వయస్సులోనే ఓ మైనర్‌ (బాలిక)ను ప్రేమించాడు. బాలిక దక్కలేదని రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఇంటిపై మూడు రోజుల క్రితం బిల్డింగ్‌పై నుంచి కిందకు దూకాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  

ఇన్‌స్పెక్టర్‌ పవన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్‌ న్యూఎన్‌ఎల్‌బీ నగర్‌కు చెందిన జగన్‌కుమార్‌కు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు కాగా ఒక అబ్బాయి మణికళ్యాణ్‌(19). మణికళ్యాణ్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదివే క్రమంలో అదే కాలనీకి చెందిన ఓ బాలికను ప్రేమించాడు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను తీసుకుని వారి సొంతప్రాంతం కర్ణాటకకు వెళ్లారు. దీంతో అప్పటి నుంచి మణికళ్యాణ్‌ మద్యానికి బానిసయ్యాడు. రాత్రిపూట మద్యం సేవించి ఇంటికొచ్చి ప్రేమించిన అమ్మాయి కావాలంటూ గొడవపడేవాడు.  

ఈనెల 13వ తేదీన మద్యం సేవించి ఇంటికి వచ్చిన మణికళ్యాణ్‌ రాత్రి 12గంటల సమయంలో బిల్డింగ్‌పై నుంచి కిందకు దుకాడు. తీవ్ర గాయాల అవ్వడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మణికళ్యాణ్‌ను ఓప్రైవేట్‌ అస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మణికళ్యాణ్‌ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు