అమ్మానాన్నా.. క్షమించండి

18 Oct, 2022 01:56 IST|Sakshi
సాకేత్‌కుమార్‌, సూసైడ్‌నోట్‌  

తల్లిదండ్రులకు ఓ యువకుడు సూసైడ్‌నోట్‌  

యూపీఎస్‌సీ పాస్‌ కాలేదని ఆత్మహత్య 

ఓఆర్‌ఆర్‌ సమీపంలో పెట్రోల్‌ పోసుకుని అఘాయిత్యం 

మేడ్చల్‌ రూరల్‌: యూపీఎస్‌సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) పరీక్ష క్లియర్‌ చేయలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌నోట్‌ రాసి ఓఆర్‌ఆర్‌ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌లో నివాసం ఉండే గంగిశెట్టి సాకేత్‌ కుమార్‌ (28) ప్రస్తుతం బెంగళూరులో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

రెండేళ్ల క్రితం ఢిల్లీలో యూపీఎస్‌సీ కోచింగ్‌ తీసుకున్న సాకేత్‌ మూడుసార్లు యూపీఎస్‌సీ పరీక్ష రాసినా విజయం సాధించలేదని కుమిలిపోతూ ఉన్నాడు. ఈ నెల 16న హైదరాబాద్‌లో గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష రాసి ఇంటికి చేరుకున్నాడు. రాత్రి తల్లిదండ్రులు, సోదరి, బావతో కలిసి భోజనం చేసి పడుకుంటానని చెప్పి మొదటి అంతస్తులోని తన గదిలోకి వెళ్లాడు.

సోమవారం ఉదయం గదిలో చూడగా సాకేత్‌ కనిపించలేదు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సాకేత్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. దీంతో కుటుంబీకులు అల్వాల్‌ పోలీసులను ఆశ్రయించగా వారు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి గౌడవెళ్లి వద్ద ఓఆర్‌ఆర్‌ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది. 

గమ్యం చేరని ప్రయాణానికి ముగింపు  
సాకేత్‌ రెండు సూసైడ్‌నోట్లు రాసి ఆత్మహత్యకు పా­ల్పడ్డాడు. ‘అమ్మానాన్నా.. చెల్లి దయచేసి ఈ జన్మకి నన్ను క్షమించండి. నేను బెంగళూరు వెళ్లాక జీవితం కుదుట పడిందని, కిందటి వారం జీతం కూడా పె­రిగి మంచి భవిష్యత్తు ఉందని భావించా­ను. కానీ నేను యూపీఎస్‌సీ పరీక్ష క్లియర్‌ చేయలేదనే బాధ నా మదిలో నుంచి పక్కకి పోవడంలేదు. భావోద్వేగాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నా, గమ్యం (ఐఏఎస్‌) చేరని ప్రయాణానికి ఒక ముగింపు’అంటూ సూసైడ్‌ నోట్‌ రాశాడు. మరో సూసైడ్‌నోట్‌లో ‘భయం కారణం­గా నేను అనుకున్నది చేయలేకపోతున్నా. కాబ­ట్టి సు­లువైన మార్గంలో ఇంటిని విడిచిపెట్టాలను­కుంటున్నా. నా కోసం వెతకకండి. నేను అదృష్టవంతుడినైతే నా శరీరం కుళ్లిపోయిన స్థితిలో దొరుకుతుంది’ అని రాశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీ­లించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

మరిన్ని వార్తలు