రాత్రి ఇంటికి రానని చెప్పి.. స్నేహితుడిని బస్టాప్‌లో దింపేందుకు వెళ్తుండగా

28 Nov, 2022 08:16 IST|Sakshi
అభిసాయిరామ్‌రాజు (ఫైల్‌), నుజ్జునుజ్జయిన బైక్‌  

సాక్షి, హైదరాబాద్‌: బైక్‌ అదుపుతప్పి డివైడన్‌రు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వేణుమాధవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ మారుతీనగర్‌ కాలనీకి చెందిన దంతులూరి అభిసాయిరామ్‌రాజు (22) హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేశాడు. గత శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన అభి సిద్దిపేట నుంచి వచ్చిన మిత్రుడు రమేష్‌నును కలిశాడు. ఇద్దరు కలిసి నాగారంలోని మరో మిత్రుడి ఇంటికి వెళ్లారు.

రాత్రి ఇంటికి రావడం లేదని మరుసటి రోజు ఉదయం వస్తానని తన తల్లికి ఫోన్‌ చేసి చెప్పిన అభి రాత్రంతా మిత్రులతో కలిసి సరదాగా గడిపారు. ఆదివారం తెల్లవారుజామున రమేష్‌ను జేబీఎస్‌లో డ్రాప్‌ చేయడానికి మరో మిత్రుడి బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో ఈసీఐఎల్‌ చౌరస్తా నుంచి రాధిక వైపుగా వెళ్తుండగా సోనీ సెంటర్‌ మూలమలుపు వద్ద అదుపు తప్పిన బైక్‌ డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న అభిసాయిరామ్‌రాజు తల పగిలి అక్కడిక్కడే మృతిచెందగా రమేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు.
చదవండి: విహారంలో విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి వైద్య విద్యార్థి మృతి

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు