జిమ్‌లో వ్యాయామం.. ఇంటికెళ్లి వాంతులు చేసుకొని కుప్పకూలి మృతి..

18 Mar, 2023 10:50 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామయ్యబౌళికి చెందిన సయ్యద్‌ మజిద్‌ హుస్సేన్‌ అలియాస్‌ జునేద్‌ (26) గురువారం రాత్రి జిమ్‌లో కొంతసేపు వ్యాయామం చేశాడు. అక్కడి నుంచి స్నూకర్‌ ఆడడానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి 11:30 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వచ్చింది. వాంతులు కూడా చేసుకున్నాడు.

సాధారణమైనదేనని భావించి ఇంటి ముందు వాకింగ్‌ చేయటం ప్రారంభించాడు. ఈక్రమంలో తీవ్ర గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కరోనా తర్వాత పోస్ట్‌కోవిడ్‌ సోకిన బాధితులతో పాటు ఇతరులకు సైతం ఇటీవల గుండెపోటు పెరిగాయి. సడెన్‌ కార్డియాక్‌ ద్వారా పలువురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో గుండె జబ్బులతో రోగులు బారులు తీరుతున్నారు.

ముందస్తుగా గుర్తించడం ఎలా?
సాధారణంగా గుండెపోటు వచ్చే వాళ్లకు కొన్ని లక్షణాలు కన్పిస్తుంటాయి. ప్రధానంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరాడక పోవడం, గుండె బరువు అనిపించడం, నీరసం, చెమటలు రావడం, చేతులు లాగడం వంటివి అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ముందస్తు చికిత్స తీసుకుంటే కార్డియాక్‌ అరెస్టు నుంచి బయటపడేందుకు అవకాశం ఉంది.

దెబ్బకొడుతున్న జీవన శైలి
గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని వర్గాల వ్యక్తులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవనం తప్పడం లేదు. సరైన ప్రణాళిక లేక వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. కొన్ని రకాల ఉద్యోగాల్లో లక్ష్యాలు ఉంటాయి. అందుకోవడానికి పరుగులు పెట్టాల్సిందే. వేళకు తిండి తినరు. తిన్నా జంక్‌ఫుడ్‌ అలవాటు పడుతున్నారు. కొందరైతే చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు.

చివరికి తీవ్ర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న వయస్సులోనే హృద్రోగ ముప్పు తలెత్తుతోంది. వారంలో 4–5రోజులు బయటే తింటున్నారు. ఈ ఆహారంలో రుచికోసం అధిక మసాలాలు, నూనెలు వాడుతుంటారు. తరచూ ఇవి తినడంతో అధిక కేలరీలు శరీరంలోకి చేరుతాయి. అందుకు తగినట్లు వ్యాయామం లేకపోవడంతో ఊబకాయులుగా మారి చివరకు ఆ ప్రభావం గుండైపె చూపుతుంది.

మరిన్ని వార్తలు