శివయ్యా.. మాకెందుకీ శిక్ష

2 Mar, 2022 11:31 IST|Sakshi

నీ దర్శనానికే వచ్చాం కదా..

పుణ్యస్నానానికి వస్తే.. తీసుకెళ్లావా..

గోదావరినీటిలో మునిగిన యువకుడు

కళ్లెదుటే మృతి చెందడంతో మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు 

వరంగల్ (మంగపేట): మహాశివరాత్రి.. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈనేపథ్యంలో మహాశివుడి దర్శనం కోసం వచ్చి.. పుణ్యస్నానానికి గోదావరిలోకి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాతపడ్డాడు. తల్లిదండ్రుల కళ్లెదుటే కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. వివరాలు.. కమలాపురంలోని టీడీపీ కాలనీకి చెందిన భూక్యా రవి, శారద తమ కుమారులు చంటి, సాయికుమార్‌(19)తో కలిసి ఉదయం సుమారు 8 గంటలకు ఇంటెక్‌వెల్‌ సమీపంలో గోదావరి స్నానానికి వెళ్లారు.

తల్లి దండ్రులు గోదావరిలో స్నానాలు చేస్తుండగా సాయికుమార్‌ తన స్నేహితుడు భూక్యా తరుణ్‌తో కలిసి మరోచోట స్నానం చేసేందుకు వెళ్లాడు. తరుణ్‌ ఒడ్డుపై ఉండగా సాయికుమార్‌ గోదావరిలో దిగేందుకు ప్రయత్నిస్తూ.. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో పడిపోయాడు. చేయి అందించాలని తరుణ్‌ను కోరాడు. చేయి అందించిన తరుణ్‌ సైతం సాయికుమార్‌తో పాటు గోదావరిలో పడిపోయాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో కాపాడాలంటూ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు తరుణ్‌ను బయటకు తీసుకురాగా అప్పటికే సాయికుమార్‌ నీటమునిగాడు.

తహసీల్దార్‌ సలీం, ఎస్సై తాహెర్‌బాబా సంఘటనా స్థలానికి చేరుకుని నాటు పడవల సాయంతో గజఈతగాళ్లు వలలతో గాలింపు ముమ్మరం చేశారు. స్థానిక మత్స్యకారులు నాటుపడవల సాయంతో వలలతో గాలిస్తూ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సాయికుమార్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్లెదుటే విగతజీవిగా మారిన కుమారుడి మృతదేహం వద్ద .. శివయ్యా.. ఏం పాపం చేశామని ఈ శిక్ష వేశావు.. నీ దర్శనానికే వచ్చాముకదా.. దయ చూపలేదు కదా.. అంటూ ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు