తెర పై స్మొ ‘కింగ్స్‌’

31 May, 2022 07:23 IST|Sakshi

రాజేంద్రనగర్‌కు చెందిన ఓ టీనేజర్‌ ఒకటి తర్వాత ఒకటిగా ప్యాకెట్‌ సిగిరెట్లు హాంఫట్‌ చేశాడు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. కేజీఎఫ్‌ సినిమాలో హీరోను చూసి ఆ కుర్రాడు ఫాలో అయ్యాడనేది తర్వాత తెలిసిన సంగతి. అయితే ఈ తరహాలో టీనేజర్లపై సినిమాలు, వెబ్‌ సిరీస్‌ ప్రభావం తీవ్రమవుతోందని, మరింత తీవ్రంగా మారనుందని గతంలోనే నగరం వేదికగా నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. ఈ నేపధ్యంలో టీనేజర్ల భవిష్యత్తు ‘పొగ’చూరిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 

సాక్షి , హైదరాబాద్‌: మాస్‌ మీడియా మరియు ఇంటర్నెట్‌లోని సెలబ్రిటీల విజువల్స్‌కు ప్రభావితమైన యువకులు మద్యపానంతో పాటు ధూమపానానికి అలవాటు పడుతున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సీనియర్‌ సోషల్‌ సైంటిస్ట్‌ (డిప్యూటీ డైరెక్టర్‌) మేకం మహేశ్వర్‌ గతంలో నిర్వహించిన అధ్యయనం దీన్ని నిర్ధారించింది. ‘టీనేజర్స్‌ డైట్‌ మరియు హెల్త్‌–రిలేటెడ్‌ బిహేవియర్‌పై మాస్‌ మీడియా ప్రభావం’ అనే అంశంపై చేసిన సర్వేలో 15 శాతం మంది అబ్బాయిలు సెలబ్రిటీలను అనుకరించడానికే తాము సిగరెట్‌ తాగామని స్పష్టం చేశారు.

సినిమాతో పాటు వెబ్‌సిరీస్‌ తదితర సోషల్‌ మీడియా సెలబ్రిటీలు సైతం వీరిని  ప్రభావితం చేశారని తేలింది. మిగతా వయసుల వారితో పోలిస్తే టీనేజర్లపై స్మోకింగ్‌ సీన్స్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోందని  పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు సైతం వెల్లడించాయి.  

ఆన్‌లైన్‌ లోకం..అవగాహనే శరణ్యం.. 
ప్రపంచం అంతా ఆన్‌లైన్‌ మీదే నడిచే రోజులు వచ్చేస్తున్న పరిస్థితుల్లో పిల్లల్ని స్మోకింగ్‌ సీన్స్‌కి దూరంగా ఉంచడం అంత సులభ సాధ్యం కాదు. అయినా ఆ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ధూమపానం వల్ల కలిగే అనర్ధాలను తరచుగా వారికి వివరించి చెబుతూ ఉండాలని వైద్యులు, మానసిక చికిత్స నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఇచ్చే పాకెట్‌ మనీని నియంత్రించడం, వారి అలవాట్లపై ఓ కన్నేసి ఉంచాలని అంటున్నారు.  

టీనేజీకి...చాలా ప్రమాదకరం 
గతంలో టీనేజర్స్‌ స్మోకింగ్‌కు ఇంట్లో తండ్రో, తాతో, అన్నో.. ప్రభావం కారణమయ్యేది.  ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రభావం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూపిస్తున్నాయి.  సిగరెట్లలలో వందల కొద్దీ హానికారక పదార్ధాలు ఉంటాయి.   చిన్నవయసులో అలవాటు పడితే అది ఎదుగుదల హార్మోన్లపైనా చెడు ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. ఆస్తమా, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మా పిల్లలకు ఆ అలవాటు కాదులే అనే ధీమాకి పోకుండా...స్మోకింగ్‌ను పిల్లలకు దూరంగా ఉంచడానికి వారిలో ముందస్తుగానే అవగాహన పెంచడం అవసరం.  
–డా.రమణప్రసాద్, కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్, కిమ్స్‌ ఆసుపత్రి

(చదవండి: తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది అభ్యర్థులకు ఉత్తమ ర్యాంకులు)

మరిన్ని వార్తలు