తెల్లవారితే వివాహ నిశ్చితార్థం.. అంతలోనే మృత్యుముఖం 

8 Jul, 2021 09:37 IST|Sakshi
రోజా (ఫైల్‌), రెయిలింగ్‌ కూలడంతో కిందపడిన కాంక్రీట్‌ దిమ్మెలు, రెయిలింగ్‌ కూలిన మూడంతస్తుల భవనం

 భవనం రెయిలింగ్‌ కూలి యువతి దుర్మరణం

ఆనందం నిండాల్సిన ఇంట్లో తీరని విషాదం

సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: తెల్లవారితే ఆ యువతికి పెళ్లి నిశ్చితార్థం.. అంతలోనే ఆమెను రెయిలింగ్‌ రూపంలో మృత్యువు కబళించింది. మూడంతస్తుల భవనంపై నుంచి రెయిలింగ్‌ కూలి కింద కూర్చున్న  యువతిపై పడటంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తమ గారాలపట్టి వివాహ నిశ్చితార్థ ఏర్పాటులో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీరని విషాదం నెలకొంది. ఈ దుర్ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకోగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది.

కూకట్‌పల్లి ఎస్‌ఐ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కారంకోట గ్రామానికి చెందిన జట్టూరి శేఖర్, సత్తెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు రోజా బీటెక్‌ పూర్తి చేసింది. ఆమె స్నేహితురాలు మౌనికతో పాటు మరో మిత్రురాలితో కలిసి కూకట్‌పల్లిలో గది అద్దెకు తీసుకొని ఉంటోంది. శామీర్‌పేట్‌లోని ఎస్‌పీ అక్యూర్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో రోజాకు వివాహం కుదిరింది.

కొత్త దుస్తుల కోసం వెళ్లగా..
బుధవారం పెళ్లి ముహూర్తం పెట్టుకునే రోజు కావటంతో మంగళవారం సాయంత్రం కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయం రోడ్డులోని శ్రీ బాలాజీ లేడీస్‌ ఫ్యాషన్‌ డిజైనర్స్‌ షాపులో దుస్తుల కోసం వెళ్లింది. ఆ సమయంలో షాపు యజమాని ఇంటికి వెళ్లటంతో  బయట తన స్నేహితురాలు మౌనికతో వేచి చూస్తోంది. ఒక్కసారిగా షాపు భవనం మూడో అంతస్తు నుంచి రెయిలింగ్‌ విరిగి రోజా తలపై బలంగా పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మృతురాలి తండ్రి శేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సదరు భవనం ఓ ఎమ్మెల్యే బంధువులకు చెందింది కావటంతో కూకట్‌పల్లి పోలీసులు మృతురాలి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు