గానం.. ఆమె ప్రాణం

11 Nov, 2020 09:08 IST|Sakshi

ఫోక్‌ సింగర్‌గా రాణిస్తున్న యువతి

స్వతహాగా పాటల రచన, గీతాలాపన

ఇప్పటికే పలు ఆల్బమ్‌ల రూపకల్పన

హన్మకొండలోని ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోన్న గూడెల్లి ప్రేమలతకు చిన్నప్పటి నుంచి పాటలంటే ప్రాణం. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగుల గ్రామం ఆమె స్వస్థలం. పాఠశాల స్థాయి నుంచే వేదికలపై పాటలు పాడటం అలవాటుగా చేసుకుంది. రాగయుక్తంగా పలు సామాజిక, సినీ గీతాలు ఆలపించి గుర్తింపు పొందింది. చిన్నప్పటి నుంచే పాటలు పాడి ఆల్బంలుగా విడుదల చేయాలనే తపన ఉన్నా పేదరికం అడ్డొచ్చింది. ఇందుకోసం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదివేటప్పుడే ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టింది. 2013లో ఆర్టీసీ కానిస్టేబుల్‌ ఉద్యోగం రావడంతో ఆమె పాటకు రెక్కలొచ్చాయి.

జానపద ఆల్బంల రూపకల్పన..
ఉద్యోగం సాధించాక పాటలు పాడేందుకు, ఆల్బమ్‌లు తయారు చేసేందుకు ఆర్థికంగా వెసులుబాటు దొరికింది. వరంగల్‌లోని ప్రభుత్వ సంగీత కళాశాలలో కర్ణాటక సంగీతంలో ఓనమాలు దిద్దింది. సరిగమలు నేర్చుకుంటూనే పల్లెగీతాలను ఆలపించడంపై దృష్టి సారించింది. తొలుత పలు యూ ట్యూబ్‌ ఛానళ్లలో గీతాలు ఆలపించింది. స్వయంగా రాసి ఆలపించిన ‘తాళి కట్టి ఏలుకో పిలగా, తెల్ల చీరకట్టు, నాటు కోడి గరం మసాలా, ముదిరాజు ముద్దుబిడ్డడటా, నేనొక మగువను, బతుకమ్మ, సమాజ కనువిప్పు, కరోనా’ తదితర గీతాలు పల్లె ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అవే కాకుండా ప్రీ వెడ్డింగ్‌ గీతాలు, వివాహాలు, జన్మదినాల సందర్భంగా గీతాలు రాసి ఆలపిస్తూ గుర్తింపు పొందుతోంది. తాను రాసిన గీతాలు ఆల్బమ్‌లుగా రూపొందించడమే కాకుండా నటించి ఔరా అనిపించింది. 

తల్లి వరి నాట్లు వేసేటప్పుడు పాడిన పాటలు.. ఊర్లో అమ్మలక్కలు పలు సందర్భాల్లో ఆలపించిన గీతాలు చిరుప్రాయంలోనే ఆమె మనసుకు హత్తుకున్నాయి. పల్లెటూరిలో ప్రకృతితో పెనవేసుకున్న బంధం పాటల ఊటలా మారింది. ఎన్నో గీతాలు రాసేందుకు, వాటిని జనరంజకంగా పాడేందుకు ఆలంబన అయింది. వృత్తి వేరైనా.. పాటలు పాడటం ప్రవృత్తిగా చేసుకున్న ఆ యువతి రాణిస్తోంది. స్వతహాగా గీతాలు రాస్తూ వాటికి బాణీలు సమకూరుస్తూ పసందైన పల్లె గీతాలను సమాజానికి అందిస్తోంది. ఆర్టీసీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూనే జానపద గాయనిగా తనదైన ముద్ర వేసుకున్న గూడెల్లి ప్రేమలత సంగీత ప్రియులను ఓలలాడిస్తోంది. 
– తొర్రూరు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా