మంచిర్యాల: ఇందారంలో లైవ్‌ మర్డర్‌! అసభ్య మెసేజ్‌లతో వేధిస్తున్న యువకుడిని కిరాతకంగా..

25 Apr, 2023 11:41 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. ఊరంతా చూస్తుండగానే ఓ​ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణానికి తెగబడింది ఒకే కుటుంబంగా తెలుస్తోంది. వేధింపుల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం.

ముస్కె మహేష్‌(28) అనే వ్యక్తి బైక్‌లో పెట్రోల్‌ కొట్టించుకుని వస్తున్న క్రమంలో.. అడ్డగించిన ఆ నలుగురు దాడికి దిగారు. గొంతు కోసి ఆపై బండ రాయితో తల పగలకొట్టారు. ఆ సమయంలో స్థానికులెవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. పైగా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.  

ఇందారం గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, మహేష్‌కు నడుమ గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. ఆపై ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ యువతి తల్లి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో మహేష్‌ ఫోన్‌ ద్వారా అసభ్య మెసేజ్‌లతో వేధిస్తుండడంతో ఆ కుటుంబం భరించలేకపోయింది. ఎంత చెప్పినా అతని తీరు మారలేదు. ఈ క్రమంలో వివాహిత తన తల్లిదండ్రులు, సోదరుడితో మాటువేసి ఈ ఉదయం మహేష్‌ను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.

నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై విచారణ చేపట్టారు. మరోవైపు మహేష్‌ను చంపిన నలుగురిని తమకు అప్పగించాలంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఇంకోవైపు మహేష్‌ వేధింపులపై వివాహిత కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా మహేశ్ వేధింపులు ఆగకపోవడంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఈ దారుణానికి తెగబడినట్లు చెబుతున్నారు.


మరిన్ని వార్తలు