ట్రెండ్‌ మారింది గురూ! వయసు 23 నుంచి 32..పెళ్లిపై ఫుల్‌ క్లారిటీ.. సాఫ్ట్‌వేర్‌ అయితే ఓకే.. 

25 Dec, 2021 09:05 IST|Sakshi

ఏడడుగుల బంధానికి ఓ వెబ్‌  

భద్రమైన భవిష్యత్తుకే ఓటేస్తున్న యువత 

ఆచితూచి జీవిత భాగస్వామి ఎంపిక 

గత 12 నెలల్లో 67% పురుషులు,  33% మహిళల వివాహ రిజిస్ట్రేషన్‌లు  

వైవాహిక జీవనంపై స్పష్టమైన అవగాహన 

ఉన్నత విద్య, భారీ వేతనం వైపు మొగ్గు 

కులాంతర పెళ్లిళ్లకూ వధూవరులు ఓకే    

తెలుగు మ్యాట్రిమోని నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: జీవిత భాగస్వామి ఎంపికలో భద్రమైన భవిష్యత్తుకే నవతరం ఓటేస్తోంది. ఉన్నత చదువులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఉన్న జీవిత భాగస్వామినే ప్రస్తుత యువత కోరుకుంటున్నారని ప్రముఖ పెళ్లి సంబంధాల వేదిక తెలుగు మ్యాట్రిమోని నివేదికలో వెల్లడైంది. జీవిత భాగస్వామి ఎంపికలో ఏయే అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అనే దానిపై నివేదిక ఆసక్తికరమైన వివరాలను తెలిపింది. అవి ఏంటంటే..   

► గడిచిన 12 నెలల్లో మొత్తం మ్యాట్రిమోని రిజిస్ట్రేషన్లలో 67 శాతం మంది పురుషులు, 33 శాతం మహిళలు ఉన్నారు. వీరిలో 70 శాతం మంది ప్రొఫైల్స్‌ని స్వయంగా నమోదు చేసుకోవడం చూస్తే యువతలో తమ వైవాహిక జీవితం పట్ల స్పష్టత తెలుస్తోంది. సామాజికంగా రకరకాల మార్పులు వస్తున్నప్పటికీ వధూవరుల ఎంపికలో ఇరువైపులా చదువే ప్రథమ స్థానంలో ఉంది. మంచి చదువుతో పాటు చేసే ఉద్యోగం, అందుకు తగిన వేతనం ఎంపికలో అగ్రస్థానంలో ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్‌కు సై.. 
వెబ్‌సైట్‌లలో నమోదు చేసుకున్న పురుషులు 45 శాతం సాఫ్ట్‌వేర్‌ వృత్తిలోని భాగస్వామిని కోరుకున్నారు. 43 శాతం మంది మహిళలు కూడా సాఫ్ట్‌వేర్‌ రంగం పట్లే ఆసక్తి కనబరిచారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో పాటు టీచర్లు, డాక్టర్లు తదితర రంగాల వారూ ఉన్నారు.  

కులానికి తగ్గిన ప్రాధాన్యం.. 
మంచి చదువు, వేతనం ఉంటే ఇరువైపులా కుల వ్యత్యాసాల గురించి పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. నివేదిక పేర్కొన్న ప్రకారం 16.4శాతం స్త్రీలు  వేరే కులం వారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండగా, 24.3 శాతం పురుషులు తాము కూడా అన్య కులస్తులకు సై అంటున్నారని నివేదిక వెల్లడించింది. ‘పదేళ్ల క్రితం కులాంతర వివాహం పట్ల ఆసక్తి కనబరించిన వారిలో ఒకరో ఇద్దరో ఉండగా ప్రతియేటా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ట్రెండ్‌ కులాంతర వివాహాల వైపు దూసుకు వెళుతోంది’ అని మ్యాట్రిమోని సైట్స్‌ తమ జాబితాలో ఉన్న సభ్యుల నివేదిక ద్వారా తెలియజేస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే నవతరం కులం కన్నా మిగిలిన అన్ని విషయాల్లో సమవుజ్జీలకే తగిన ప్రాధాన్యమిస్తున్నట్టుగా కనిపిస్తోంది.  

ఈడుంటేనే జోడు 
► జీవిత భాగస్వామిని కోరుకునే మహిళల్లో 74.1 శాతం మంది 23 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు వారు కాగా, 72.3 శాతం మంది పురుషులు 23 నుంచి 32 సంవత్సరాల వయసు వారున్నారు. దీనిని బట్టి ఆధునికులు తమ వివాహ వయసును ఇదమిత్థంగా నిర్దేశించుకుంటున్నారని తేలుతోంది. 
►  మ్యాట్రిమోని.కామ్‌ ఛీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అర్జున్‌ భాటియా ప్రస్తుత వధూవరుల వివాహ ఎంపిక గురించి తెలియజేస్తూ ‘జీవిత భాగస్వామిని కనుగొనే విషయంలో ఇది అత్యంత విశ్వసనీయ ఎంపికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది తెలుగువారి నమ్మకాన్ని సంపాదించినట్టుగా’ వివరించారు.  
►  పెళ్లి కోసం వివరాలను నమోదుచేసుకుంటున్న వారిలో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ ప్రథమ స్థానంలో ఉంది. విజయవాడ, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, గుంటూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు