మూసీలో చిక్కుకున్న యువకులు

17 Aug, 2020 11:08 IST|Sakshi
మూసీలో చిక్కుకున్న యువకులను తాళ్ల సహాయంతో బయటకు తీసుకువస్తున్న స్థానికులు, పోలీసులు

ముగ్గురిని క్షేమంగా ఒడ్డుకు చేర్చిన 

స్థానికులు, అధికారులు, పోలీసులు

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, ఆర్డీఓ

సూర్యాపేటరూరల్‌ : చేపల వేటకు వెళ్లి సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామ సమీపంలో గల మూసీ నదిలో చిక్కుకున్న ముగ్గురు యువకులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఆదివారం చివ్వెంల మండలం ఖాసీంపేటకు చెందిన షబ్బీర్, సోహెల్, కైఫ్‌లు వరదనీటిలో చిక్కుకొని కేకలు వేయగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇతర అధికారులకు సమాచారం అందించి సంఘటనా స్థలానికి చేరుకొని మూసీ అధికారులతో మాట్లాడి వరద ఉధృతి తగ్గింపులో భాగంగా గే ట్లను కొంత మేర కిందకు దించారు. దీంతో స్థానికులు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు యువకులను తాళ్ల సహాయంతో కాపాడి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.

వద్దన్నా చేపల వేటకు.. 
ఆదివారం ఉదయాన్నే ఖాసీంపేటకు చెందిన ముగ్గురు యువకులు షబ్బీర్, సోహెల్, కైఫ్‌లు మూ సీ నదిలోకి చేపల వేటకు వెళ్తుండగా కేటీ అన్నారం గ్రామస్తులు మూసీ గేట్లు ఎత్తారని, చేపల వేటకు వెళ్తే ప్రమాదంలో పడుతారని చెప్పినప్పటికీ వారు వినలేదు. ఉదయం 9 గంటల ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన ము గ్గురు సాయంత్రం సమయంలో వరదనీటిలో గల్లంతై కేకలు వేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు
సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి సూర్యాపేటరూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్పీ భాస్కరన్, సూర్యాపేట ఆర్డీఓ కాసుల రాజేంద్రకుమార్, సూ ర్యాపేటరూరల్‌ సీఐ విఠల్‌రెడ్డి, తహసీల్దార్‌ వెంకన్న, జెడ్పీటీసీ జీడి భిక్షం సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

సహాయక చర్యలు చేపట్టిన ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు 
చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మూసీ నదిలో చిక్కుకున్న యువకులను స్థానిక ప్రజలు, పోలీసు, అధికారుల భాగస్వామ్యంతో రెస్క్యూ చేసి కాపాడినట్లు జిల్లా ఎస్పీ భాస్కరన్‌ తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ అ«ధికారులకు స్థానిక ప్రజలు సహకారం అందించడం అభినందనీయమన్నారు. వర్షాలు బాగా కురుస్తుండడంతో నదులు, వాగులు, నీటితో నిండి ప్రవహిస్తున్నాయని, ఈ సమయంలో నీటిలోకి వెళ్లడం ప్రమాదకరమన్నారు. ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. సంఘటనకు సంబంధించి సమాచారం అందగానే వేగంగా రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించిన పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ప్రజలు అభినందనలు తెలిపారు. ముగ్గురు యువకులు క్షే మంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

‘పేట’ పోలీసులకు డీజీపీ అభినందన
సూర్యాపేటరూరల్‌ : సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామం వద్ద ప్రమాదవశాత్తు మూసీనదిలో చివ్వెంల మండలం ఖాసీంపేటకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం చిక్కుకుపోవడంతో స్థానికులు, పోలీసులు, అధికారుల సహాయంతో క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.   సమాచారం అందగానే స్థానిక ప్రజలు ముగ్గురు యువకులను కాపాడేందుకు అందించిన సహకారం అభినందనీయమని ఎస్పీ భాస్కరన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా స్పందించిన డీజీపీ మహేందర్‌రెడ్డి రెస్క్యూ టీంలో పాల్గొన్న స్థానిక ప్రజలను, పోలీసులను, అధికారులను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.  

>
మరిన్ని వార్తలు