YS Sharmila: పాలేరు నుంచే పోటీ చేస్తా 

20 Jun, 2022 04:55 IST|Sakshi

గెలవడం కాదు.. చరిత్ర సృష్టించే మెజారిటీ రావాలి 

నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో వైఎస్‌ షర్మిల 

నేలకొండపల్లి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. పాలేరులో గెలవడం సమస్య కాదని, కనీవినీ ఎరగని మెజారిటీ వచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆదివారం జరిగిన పాలేరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో షర్మిల మాట్లాడారు.

వైఎస్‌ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలనే కోరిక తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచీ ఉందని, ప్రస్తుతం ప్రజలతోపాటు తన అభీష్టం కూడా అదేనని ఆమె తెలిపారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వైఎస్సార్‌ అనే పేరుకు తామే వారసులమని, ఇతర వ్యక్తులకు, ఏ పార్టీకి ఆ హక్కు లేదని ఆమె స్పష్టం చేశారు. ఖమ్మం అంటే వైఎస్సార్‌ జిల్లా అని, ఈ జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్‌ ఫొటో పెట్టుకుని గెలిచారని గుర్తు చేశారు.

వైఎస్‌ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలని ఆకాంక్షించారు. ‘ఇకపై షర్మిల ఊరు పాలేరు. జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తారు. వైఎస్‌ వారసులమైన మనం భయపడతామా?’అని పేర్కొన్నారు. ఆయన అవినీతి గురించి మాట్లాడితే సమాధానం చెప్పలేక అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. బయ్యారం మైనింగ్‌లో తమకు వాటాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారని, తన బిడ్డలపై ఒట్టేసి చెబుతున్నానని.. ఎలాంటి భాగాలు లేవని ఆమె తెలిపారు 

చదవండి: (‘నాకు, నా భర్తకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది’)

మరిన్ని వార్తలు