రైతులను దగా చేశారు..వైఎస్‌ షర్మిల ‌

27 Mar, 2021 03:01 IST|Sakshi

ఎంపీ అర్వింద్‌పై షర్మిల మండిపాటు 

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల నేతలతో అత్మీయ సమ్మేళనం

సాక్షి, హైదరాబాద్‌: ఓట్ల కోసం రైతులను నమ్మించి దగా చేశారంటూ నిజామాబాద్‌ ఎంపీ డి.అరవింద్‌పై దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. గెలిచిన వెంటనే పసుపు బోర్డు తెస్తానన్న హామీతో బాండ్‌ పేపరు కూడా రాసిచ్చి, ఆ తర్వాత రైతులను మోసం చేశారని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన వైఎస్సార్‌ అభిమానులు, సానుభూతిపరులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పసుపు ఉత్పత్తిలో నిజామాబాద్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ అని, ప్రతి గడపకు పూసే పసుపు, అందరి నోటిని తీపి చేసే చెరుకు పండించే ప్రాంతం నిజామాబాద్‌ అని పేర్కొన్నారు. 

అలాంటి ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ కశ్మీర్‌ అయిన ఆదిలాబాద్‌ జిల్లా.. పచ్చటి అడవులు, కుంటాల జలపాతంతో పర్యాటకులను ఆకట్టుకుంటోందని చెప్పారు. కానీ జలియన్‌వాలా బాగ్‌ని తలపించే ఇంద్రవెల్లి ఘటన ఇంకా మనసులను రగిలిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భైంసా మతకల్లోలకు కారణం ఎవరని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌ పేరుతో ప్రస్తుత పాలకులు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలకు అన్యాయం చేస్తున్నారన్నారు.  

ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు తలమానికం 
ఆదిలాబాద్‌కు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్‌ తలమానికమని షర్మిల అన్నారు. వైఎస్సార్‌ హయాంలో మేజర్‌ ప్రాజెక్టులు పూర్తి చేశారని, ప్రస్తుతం ప్రాజెక్ట్‌ పనులు మందకొడిగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజన్న సంక్షేమం కోసం నిలబడతానని స్పష్టం చేశారు. అందుకు అందరి సలహాలు, సూచనలు కావాలని కోరారు. 

షర్మిలకు మద్దతుగా 10 మంది సర్పంచ్‌లు 
వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెజ్జింకి అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఉభయ ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్‌ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాగోబా వంశీయులు, గోండు జాతి ఆదివాసీలు షర్మిలకు మద్దతు పలికారు. తెలంగాణ బిడ్డ షర్మిలమ్మ నాయకత్వంలో పని చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నాగోబా ఆలయ కమిటీ చైర్మన్‌తో పాటు ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన 10 మంది సర్పంచ్‌లు వైఎస్‌ షర్మిలకు మద్దతు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు