ఒక్క నీటి బొట్టునూ వదులుకోం

17 Jul, 2021 01:54 IST|Sakshi

వైఎస్‌ షర్మిల స్పష్టీకరణ 

నీటి సమస్యల పరిష్కారంలో కేసీఆర్‌ విఫలం 

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేయం 

వైఎస్సార్‌ తెలంగాణ వ్యతిరేకి కాదు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి ఒక్క నీటి బొట్టును కూడా వదులుకోబోమని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. అలాగని ఇతర ప్రాంతాలవి ఆపబోమని చెప్పారు. నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్‌ విడుదల చేయడంలో సీఎం కేసీఆర్‌ తప్పులేదా అని ప్రశ్నించారు. బోర్డు సమావేశాలకు వెళ్లే బాధ్యత ఆయనకు లేదా అని నిలదీశారు. ఏడేళ్ల పాలనలో నీటి సమస్యల పరిష్కారంలో కేసీఆర్‌ విఫలమయ్యారని, రాజకీయం చేసేందుకే ఆయన నీటి సమస్యను ఎత్తుకుంటారని విమర్శించారు. శుక్రవారం లోటస్‌ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో నేతలు కొండా రాఘవరెడ్డి తదితరులతో కలిసి షర్మిల విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  

తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు 
‘తెలంగాణ నా గడ్డ. ఇక్కడ ప్రజలు సంతోషంగా లేరు. వారికి జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకు, ప్రజలకు మేలు చేసేందుకే పార్టీ పెట్టాం. అంతేకానీ ఎవరిమీదనో అలిగి పార్టీ పెట్టలేదు. ఉద్యమకారుడిగా కేసీఆర్‌ అంటే అభిమానం ఉండేది. కానీ ఆయనలోని దొరతనం బయటపడుతోంది. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి సామాన్యులకు సైతం అనుమతి ఉండేది. ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అవ్వాలనేది కేటీఆర్‌ ఉద్దేశమా? ఒక మహిళగా నేను పార్టీ పెట్టకూడదా? 3 లక్షల ఉద్యోగాలు ఇస్తే నా వ్రతం విజయవంతమైందని అనుకుంటా. పెద్ద మొగోడు కదా ఆ పనిచేసి చూపించమనండి..’అని షర్మిల అన్నారు.  

వైఎస్‌కు కాంగ్రెస్‌ వెన్నుపోటు 
‘వైఎస్సార్‌ వల్లే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. కానీ టీడీపీలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌కు వెన్నుపోటు పొడిచారు. చనిపోయిన తర్వాత అయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో పెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయింది. బీజేపీ కూడా టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయ్కింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమే. ఈ ఎన్నికలో మేము పోటీ చేయబోము..’ అని తెలిపారు.  

తెలంగాణ కోసం వైఎస్‌ కృషి 
‘దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెలంగాణ వ్యతిరేకి ఎంత మాత్రమూ కాదు. తెలంగాణ అంశంపై 2000 సంవత్సరంలోనే 41 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించారు. అలాగే 2004, 2009 యూపీఏ మేనిఫెస్టోల్లో సైతం పెట్టించారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ వెనుకబాటుతనం తగ్గించేందుకు కృషి చేశారు..’ అని షర్మిల వివరించారు. 

ఏపీలో రాజన్న రాజ్య స్థాపన జరుగుతున్నట్టే ఉంది 
ఏపీలో రాక్షస పాలన వద్దనుకుని ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారని షర్మిల చెప్పారు. అక్కడ రాజన్న రాజ్య స్థాపన జరుగుతున్నట్లే అనిపిస్తోందని అన్నారు. ఐతే ప్రజలే అంతిమ నిర్ణేతలని, పాలన నచ్చకపోతే వారే జవాబు చెబుతారని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు