కేసీఆర్‌ స్పందించే వరకు నిరాహార దీక్ష

16 Sep, 2021 01:51 IST|Sakshi
నిరాహారదీక్షలో వైఎస్‌ షర్మిల. చిత్రంలో వైఎస్‌ విజయమ్మ 

బాలిక హత్యాచార ఘటనపై వైఎస్‌ షర్మిల ప్రకటన 

బాధితుల ఇంటి వద్దనే బైఠాయింపు 

చిన్నారి కుటుంబానికి ఏం పరిహారం ఇస్తారో చెప్పాలని డిమాండ్‌

సాక్షి, సైదాబాద్‌ (హైదరాబాద్‌): ఆరేళ్ల గిరిజన బాలిక హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించే వరకు నిరాహారదీక్ష చేస్తానని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. వెంటనే నిందితుడిని అరెస్ట్‌ చేయాలని, బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలని, వారికి ఏం నష్టపరిహారం చెల్లిస్తారో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని వారి ఇంటి వద్దే దీక్షకు దిగారు. బుధవారం సింగరేణి కాలనీకి చేరుకున్న షర్మిల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ తన ఇంట్లో కుక్కకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వటం లేదని అన్నారు. గిరిజనుల ప్రాణాలంటే లెక్కలేదా అని సీఎంను ప్రశ్నించారు.

ఫామ్‌హౌస్‌లో ఉండి పాలన చేసే సీఎం, ఉపఎన్నికలు వస్తేనే బయటకు వస్తారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి రాష్ట్రంలో మహిళల రక్షణ విషయంలో పట్టింపు లేదని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు మూడురెట్లు పెరిగాయన్నారు. రాష్ట్రాన్ని అప్పులు, ఆత్మహత్యలు, బీరుల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. చిన్నారిని చిదిమేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్‌ చేసి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా త్వరగా కఠిన శిక్ష వేయించాలని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  

దత్తత కాలనీపై పట్టింపేది కేటీఆర్‌..! 
మున్సిపల్‌ ఎన్నికల సమయంలో సింగరేణి కాలనీని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన మంత్రి కేటీఆర్, తర్వాత ఎందుకు పట్టించుకోవడంలేదని షర్మిల ప్రశ్నించారు. ఈ కాలనీలో బాలికపై దుర్మార్గపు చర్య చోటుచేసుకున్నా కేటీఆర్‌ ఎందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని నిలదీశారు. 

పోలీసులపై చర్యలు తీసుకోవాలి 
బాలిక ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని షర్మిల అన్నారు. నిందితుడిపై బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేసినా పట్టించుకోలేదన్నారు. బాధ్యత లేకుండా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్‌ చేశారు. కాగా, అర్థరాత్రి దాటాక కూడా షర్మిల దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు.

షర్మిలకు మద్దతుగా విజయమ్మ 
బాలిక హత్యాచార ఘటనపై వైఎస్‌ షర్మిల చేపట్టిన దీక్షకు ఆమె తల్లి విజయమ్మ మద్దతు ప్రకటించారు. బుధవారం సాయంత్రం సింగరేణి కాలనీకి చేరుకున్న విజయమ్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి మద్దతుగా దీక్ష చేస్తున్న షర్మిలను కలిశారు. దీక్షా శిబిరంలో కూర్చొని సంఘీభావం తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు