ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలి?

17 Dec, 2021 04:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంగారు తెలంగాణ అని మాటలు చెప్పిన కేసీఆర్‌.. రాష్ట్రాన్ని రైతు చావుల తెలంగాణగా మార్చేశారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని సుబ్బకపల్లికి చెందిన మిర్చి రైతు రవీందర్‌రావు (52) అప్పుల బాధతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ముద్దాపురంకి చెందిన పత్తి రైతు బడక నరసింహ(43) కూడా పంట దెబ్బతినడంతోనే నష్టపోయి ఉరేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు

 ప్రభుత్వం చెబుతున్నట్టు వరి పంట కాకుండా వానాకాలంలోనే పత్తి, మిర్చి వేసిన రైతులు సైతం అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతుండటం పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు. గురువారం ఈ మేరకు పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇంకా ఎంత మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కేసీఆర్‌ ఆకలి తీరుతుందని షర్మిల సూటిగా ప్రశ్నించారు. రైతుల పట్ల కేసీఆర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, కేవలం 70 రోజుల్లోనే 206 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆమె మండిపడ్డారు.

 రైతుల చావులను పట్టించుకోని కేసీఆర్‌ పుణ్యక్షేత్రాలకు తిరుగుతున్నారని, వందల మంది రైతుల చావులకు కారణమైన కేసీఆర్‌ పాపం ఊరికే పోదన్నారు. రైతుల జోలికొచ్చిన ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమని, రైతును కాటికి పంపుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రేపు పాడె కట్టేది, అధికారానికి పాతరేసేది రైతులే అని షర్మిల హెచ్చరించారు. రైతు కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి ఈ నెల 19వ తేదీ నుంచి రైతు ఆవేదన యాత్రను చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు.   

>
మరిన్ని వార్తలు