సమాజాన్ని బాగు చేసేందుకే!

25 Feb, 2021 02:44 IST|Sakshi

అందరి నిరీక్షణ ఫలించాలంటే మంచి సమాజం రావాలి 

విద్యార్థులతో భేటీలో వైఎస్‌ షర్మిల స్పష్టీకరణ 

సాక్షి, లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): సమాజాన్ని బాగుచేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. ‘ఈ రోజు అందరికీ మంచి సమాజం కావాలి. అందరి నిరీక్షణ ఫలించాలంటే మంచి సమాజం రావాలి’అని ఆమె స్పష్టం చేశారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో షర్మిల పలు యూనివర్సిటీలు, కాలేజీలకు చెందిన విద్యార్థులతో సమావేశమయ్యారు. తాను, విద్యార్థులు ఒకేలా ఉన్నామని పేర్కొన్నారు. తాను రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా, తెలుగు ప్రజలందరినీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని షర్మిల అన్నారు.


బుధవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో విద్యార్థులతో భేటీ అయిన వైఎస్‌ షర్మిల  

డబ్బు లేని కారణంగా ఏ పేద విద్యార్థి చదువు కూడా ఆగి పోవొద్దని వైఎస్‌ భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఫీజులు ప్రభుత్వమే భరించేదని పేర్కొన్నారు. దీంతో నేడు ఎంతో మంది చాలా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారంతా ఇప్పటికీ రాజశేఖరరెడ్డిని గుర్తు పెట్టుకున్నారని చెప్పారు. ప్రతి జిల్లాకూ యూనివర్సిటీ తెచ్చిన ఘనత వైఎస్సార్‌దేనని కొనియాడారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అందరికీ ఒక మంచి సమాజం కావాలన్నారు. తెలంగాణలో ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఓయూ విద్యార్థులు నవీన్‌ యాదవ్, అర్జున్‌ బాబు, నాగరాజు చక్రవర్తి, ఉదయ్‌ కిరణ్, మోజెస్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు