కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌కు అమ్ముడుపోయాయి

1 Jul, 2022 01:50 IST|Sakshi

సూర్యాపేట రూరల్‌: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌కు అమ్ముడుపోయాయని, టీఆర్‌ఎస్‌కు ఎదురొడ్డి పోరాడేది వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఒక్కటేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం సూర్యాపేట మండల పరిధిలోని సైనిక్‌పురి కాలనీ నుంచి కుసుమవారిగూడెం మీదుగా తాళ్లఖమ్మం పహడ్‌కు చేరుకుంది.

తాళ్లఖమ్మంపహడ్‌లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించిన అనంతరం షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న కేంద్రం, లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేశాయని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఎన్నికలు వస్తేచాలు ఎంతకైనా దిగజారిపోతారని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు