ఇంటికో ఉద్యోగం ఏమైంది? : వైఎస్‌ షర్మిల 

3 Jun, 2021 04:20 IST|Sakshi
వెంకటేశ్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్‌ షర్మిల  

కేసీఆర్‌ ఏడేళ్ల పాలనలో నిరుద్యోగులకు నిరాశే: వైఎస్‌ షర్మిల 

మెదక్‌ జోన్‌/వెల్దుర్తి/తూప్రాన్‌ (మెదక్‌): పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం మళ్లీ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్‌ షర్మిల అన్నారు. ఉద్యోగం రాక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం శేరిల్ల గ్రామానికి చెందిన కొట్టమొల్ల వెంకటేశ్‌ (23) కుటుంబాన్ని ఆమె బుధవారం పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందజేశారు.

ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు సన్నగిల్లి వెంకటేశ్‌లాంటి నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని షర్మిల అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.97 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఖాళీ ఉన్న రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. రైతుల సమస్యల సాధనలకు కలిసి పోరాడుదాం అని పిలుపునిచ్చారు. 

అమరవీరుల స్తూపం వద్ద నివాళి  
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం పాటుపడదామని వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొండా రాఘవరెడ్డి, రాంరెడ్డి, ఇందిరా శోభన్, రాజగోపాల్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు