హిమాన్షును ఉద్దేశిస్తూ పోస్ట్‌.. స్పందించిన వైఎస్‌ షర్మిల

25 Dec, 2021 11:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షును ఉద్దేశిస్తూ బీజేపీ నేత తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్‌ నిర్వహించిన ఓ ఒపీనియన్‌ పోల్‌పై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. 'పిల్లల్ని వేధించడం, కుటుంబ సభ్యులపై ఇలాంటి అవమానకరమైన వ్యాఖలు చేయడాన్ని ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నాయకురాలిగా నేను ఖండిస్తున్నాను. మహిళలను కించపరచడం, పిల్లలను బాడీ షేమ్‌ చేయడం వంటివి తీవ్రమైన విషయాలు. ఇలాంటి విషయాలపై మనమంతా కలిసి రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సి ఉంది' అని వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

విషయమేంటంటే.. బీజేపీ నేత తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూన్యూస్‌ కేటీఆర్‌ కుమారుడుని ఉద్దేశిస్తూ ఓ పోల్‌ పోస్ట్‌ చేసింది. దీనిపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి తెలంగాణలో మీ బీజేపీ నేతలకు నేర్పిస్తున్నది ఇదేనా? నా కుమారుడి శరీరాకృతిపై బీజేపీ ప్రచారకర్తలు అసహ్యమైన రాజకీయవ్యాఖ్యలు చేయడం సంస్కారమేనా? అమిత్‌ షా లేక ప్రధాని మోదీలతోపాటు వారి కుటుంబాన్ని ఉద్దేశించి మేమూ మీలాగే మాట్లాడలేమనుకుంటున్నారా? ప్రజాజీవితంలో ఉండటం సరైనదేనా అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది.

ప్రత్యేకించి ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో ఎవరైనా ఎలాంటి నిందలైనా వేయొచ్చా. జర్నలిజం ముసుగులో యూట్యూబ్‌ చానళ్ల ద్వారా పనికిమాలిన చెత్తను ప్రసారం చేస్తూ పిల్లలను కూడా ఈ మురికిలోకి లాగుతారా? భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో దురదృష్టవశాత్తూ తిట్లు, బురదచల్లడం ఓ హక్కుగా మారినట్లుంది. సోషల్‌ మీడియా జర్నలిజం ముసుగులో దుష్ప్రచారం, చెత్తను ప్రసారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. సోషల్‌ మీడియా సంఘ వ్యతిరేకశక్తులకు స్వర్గంగా తయారైంది’అని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

కారణాలు లేనప్పుడు కుటుంబమే వారి లక్ష్యం: కవిత 
‘నీ ప్రతిష్టను దిగజార్చేందుకు వాళ్ల దగ్గర కారణాలు లేనప్పుడు నీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని తెలుసు కదా. సోషల్‌ మీడియా వేదికల మీద కనీసం సున్నితంగా, బాధ్యతగా ఉండటం మాత్రమే మనం చేయగలిగింది. చాలాకాలంగా సోషల్‌ మీడియా ద్వారా విద్వేషాన్ని, అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నవారు సిగ్గుపడాలి’అని కేటీఆర్‌ ట్వీట్‌కు ఆయన సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు.

మరిన్ని వార్తలు