సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ షర్మిల ధ్వజం  

20 Sep, 2022 04:01 IST|Sakshi

షాద్‌నగర్‌/షాద్‌నగర్‌ రూరల్‌/ సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గజదొంగ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా రోడ్‌షోలో షర్మిల మాట్లాడుతూ, కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని, బంగారు తెలంగాణ కాదు.. బీరు, బారు తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్నే సరిగా పాలించని కేసీఆర్‌కు ఢిల్లీ రాజకీయాలపై ఆశ పుట్టుకొచ్చిందని విమర్శించారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు తనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని షర్మిల గుర్తు చేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు దమ్ముంటే తనను అసెంబ్లీకి పిలవాలని సవాల్‌ విసిరారు. ‘సమయం మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా? అసెంబ్లీ లోపలికి రావాలా.. ముందుకు రావాలా.. అందరి ముందు మాట్లాడదామా?’ అని షర్మిల పేర్కొన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి తనను మరదలుగా సంబోధించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఆ మంత్రిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం లేదన్నారు.  

వైఎస్‌ మృతిపై విచారణ జరిపించాలి: కొండా
ఇదిలా ఉండగా, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణంపై అనుమానాలున్నాయని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్‌ మరణంపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి.. తమ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను మరదలు అనడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ.. వావి వరుసలు లేని ఒక కంత్రి మంత్రి అని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు