YS Sharmila: 8న షర్మిల పార్టీ రోడ్‌మ్యాప్‌ ఖరారు 

5 Jul, 2021 00:35 IST|Sakshi
వాల్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్న నేతలు 

సాక్షి, హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన వైఎస్‌ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటికే ‘వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ’గా పేరును ఖరారు చేయగా దీనికి సంబంధించి రోడ్‌మ్యాప్‌ తాజాగా ఖరారైంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. 8వ తేదీన వైఎస్‌ షర్మిల బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు చేరుకోనున్నారు. ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ప్రార్థనలు నిర్వహిస్తారు.

అనంతరం కడప నుంచి ప్రత్యేక చాపర్‌లో 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్‌ షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్‌కు చేరుకుని 5 గంటలకు వైఎస్‌ షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు. ఇదిలాఉండగా పార్టీ ఆవిర్భావ మహోత్సవానికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను లోటస్‌ పాండ్‌లో షర్మిల పార్టీ టీమ్‌ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు