ప్రతిపక్ష నాయకులకు వైఎస్‌ షర్మిల లేఖలు.. కలిసి పోరాడుదామంటూ పిలుపు

2 Apr, 2023 17:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాడేందుకు కలిసి రావాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రతిపక్షాలకు లేఖలు రాశారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నిరుద్యోగుల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు. ఈ పోరాటానికి జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఇప్పుడు చారిత్రక అవసరమని తెలిపారు. ఈ మేరకురేవంత్ రెడ్డి, బండి సంజయ్, కాసాని జ్ఞానేశ్వర్, కోదండరాం, అసదుద్దీన్ ఓవైసీ, మందకృష్ణ మాదిగ, తమ్మినేని వీరభద్రం, కూనంనేనీ సాంబశివరావు, ఎన్.శంకర్ గౌడ్‌లకు లేఖలు రాశారు. 

ప్రముఖ పార్టీలకు ముఖ్య ప్రతినిధులుగా ఉంటూ.. ప్రజాసమస్యలపై ఎల్లప్పుడూ పోరాడుతున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండి చేస్తున్న మీ పోరాటాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేడు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్రమైన నిరాశ, నిస్పృహలలో చిక్కి, గుండెలు మండి, కడుపుకాలి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ నియంత, మోసపూరిత ప్రభుత్వం చేసిన ద్రోహానికి కొన్ని తరాలు మొత్తం ఆహుతి అవబోతున్నాయి. 

తొమ్మిదేండ్లు నోటిఫికేషన్లు విడుదల చేయకుండా, భర్తీలు పూర్తిచేయకుండా కేసీఆర్ సర్కారు చేస్తున్న నీచ నాటకాలు మీకు తెలియనిది కాదు. ఇప్పుడు పేపర్ లీకేజీ స్కాంతో విడుదల చేసిన నోటిఫికేషన్లపై కూడా ఆశ అడుగంటిపోయింది. ఈ కఠిన సమయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ వారి వారి రాజకీయ విభేదాలను మరిచి, చేతులు కలిపి ఒక ఉమ్మడి కార్యాచరణను రూపొందించి మోసపోయిన నిరుద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. 

ఒక జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) అత్యవసర పరిస్థితిగా  ఏర్పాటు చేసి పోరాటాల వ్యూహాలన్నీ అమలుపర్చాలి. ఒక తాటిపైకి వచ్చి, చేతులు కలిపి తెలంగాణ యువత కోసం నిలబడాల్సిన సరైన సమయం ఇదే. ఏ యువకులు, విద్యార్థులు త్యాగాలతో తెలంగాణ రాష్ట్ర కాంక్ష నెరవేరిందో,  ఏ యువత తమ రక్తాన్ని చిందించి తెలంగాణ తల్లికి అభిషేకం చేసారో, ప్రాణాలను నైవేద్యంగా అర్పించుకున్నారో, వారికోసం మన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాల్సిన సమయం ఇదే.  తెలంగాణ భవిత కోసం, యువత కోసం కలిసి నడుద్దాం, నిలిచి పోరాడదాం’ అని వైఎస్‌షర్మిల తన లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు