అందుకే రేవంత్‌రెడ్డి ముందస్తు ఎన్నికల ప్రచారం .. బీజేపీతో పొత్తుపై తెగ్గొట్టిన వైఎస్‌ షర్మిల

24 Jan, 2023 15:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌కు తెలంగాణ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, తన పాదయాత్రను ఆపడమే వాళ్ల ఉద్దేశమని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 28న పాదయాత్ర పునఃప్రారంభిస్తానని ఆమె ప్రకటించారు. 

పాదయాత్ర ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే ప్రారంభిస్తా. ఫార్మాలిటీ ప్రకారం పోలీసుల అనుమతి కోరతాం. ఒకవేళ అనుమతి ఇవ్వకున్నా యాత్ర చేస్తా అని ప్రకటించారామె. అలాగే టీపీసీసీ రేవంత్‌రెడ్డిపైనా వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. 

ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి. పబ్లిసిటీ కోసమే రేవంత్‌ ముందస్తు ప్రచారం చేసుకుంటున్నారని షర్మిల అభిప్రాయపడ్డారు. ముందస్తు పేరు చెబితేనే పీసీసీ పదవి కాపాడుకోవచ్చనేది రేవంత్‌ ఆలోచన అని ఆమె ఆరోపించారు. అలాగే.. ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని వైఎస్‌ షర్మిల తెలిపారు. ఇక బీజేపీతో పొత్తుపై స్పందిస్తూ.. ‘బీజేపీతో మాకు చాలా వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి, పొత్తు ప్రస్తావనే లేదు అని ఆమె స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు