ప్రశ్నించే గొంతుకలన్నీ ఏకం కావాలి: ఇందిరా శోభన్

15 Aug, 2021 15:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా.. దేశంలో ఇంకా పేదరికం, ఆకలి చావులు కొనసాగుతుండడం దురదృష్టకరమన్నారు. అందరికీ విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మిగిలాయని ఇందిరా శోభన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలోనూ సమానత్వం, భావప్రకటన స్వేచ్ఛ లేకపోవడం మన దౌర్భాగ్యం అన్నారు.

ప్రజాస్వామ్య ముసుగులో నిరుపేదలను అణచివేస్తున్నారని ఆమె వాపోయారు. తెలంగాణ ప్రజలు స్వతంత్రంగా, స్వేచ్ఛగా మెలగాలంటే అది  ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రశ్నించే గొంతుకలన్నీ ఏకమై.. అటు దేశాన్ని, ఇటురాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇందిరా శోభన్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అనాథ చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఆకుల ప్రవీణ్, రాజ్ కుమార్, బెట్టీనాలంక, సత్తి సూరిబాబు, మునిరామ్, ప్రశాంత్, మనోజ్, నిఖిల్, శంషోద్దీన్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు