కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ప్రేమ: వైఎస్‌ షర్మిల

8 Sep, 2022 03:07 IST|Sakshi

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న ప్రేమ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంలో సీఎం కేసీఆర్‌కు లేదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. బుధవారం ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి పను లు ప్రారంభించి ఎనిమిదేళ్లు కావొస్తున్నా పూర్తి చేయడంలో చిత్తశుద్ధి లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో వేల కోట్లు మామూళ్లు దండుకున్నారని ఆరోపించారు. పాలమూరు జిల్లాకు నీళ్లు పారించి పచ్చగా ఉండాలని దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కోరుకున్నారని, అదే సందర్భంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను చేపట్టారని గుర్తు చేశారు.

పాలమూరు–రంగారెడ్డి నిర్మాణానికి కూడా ఆయన హయాంలోనే రూపక ల్పన చేశారని షర్మిల తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మహబూబ్‌నగర్‌ పట్టణంలో 24 గంటల దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కళాశాల నిర్మాణానికి 50 మంది దళితుల భూములు గుంజుకున్నారని ఇదెక్కడి న్యాయ మని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు చెరువులోని నల్లమట్టిని అమ్ముకుంటున్నారని, ఆయన్ను మర్రి జనార్దన్‌రెడ్డి అనడం కన్నా నల్లమట్టి జనార్దన్‌రెడ్డి అంటేనే బాగుంటుందని ఎద్దేవాచేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా? అని షర్మిల ప్రశ్నించారు. సెప్టెంబర్‌ 17పై కొత్త రాజకీ యాలు మొదలు పెట్టారని, ఒకరు విలీనం అంటే మరొకరు విమోచనం అని రాజ కీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి: ఎన్నికలొస్తేనే.. ఫాంహౌస్‌ నుంచి బయటికొస్తారు: వైఎస్‌ షర్మిల

మరిన్ని వార్తలు