చావనైనా చస్తాం.. భూములిచ్చే ప్రసక్తే లేదు’

21 Jan, 2021 08:09 IST|Sakshi

‘నిమ్జ్‌’అభిప్రాయ సేకరణలో తేల్చి చెప్పిన మెజారిటీ రైతులు 

సాక్షి, సంగారెడ్డి: నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్షరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని మెజారిటీ రైతులు స్పష్టంచేశారు. ‘ఒక్కో కుటుంబానికి ఉన్న రెండు, మూడెకరాల సాగు భూమిని ఇవ్వడం కుదరదు. భూమి తల్లిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడి బతుకుతున్నాం.. ఉన్న భూమిని కూడా లాక్కుంటే మేము ఎలా బతకాలి. చావనైనా చస్తాం గాని.. భూములను మాత్రం ఇచ్చే ప్రసక్తేలేదు’అని మెజారిటీ రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన ‘నిమ్జ్‌’కోసం టీఎస్‌ఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఝరాసంగం మండలంలోని బర్ధిపూర్‌ గ్రామ శివారులో బుధవారం ‘పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ’కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికోసం ఝరాసంగం, న్యాల్కల్‌ మండలాల్లోని 17 గ్రామాల ప్రజలను ఆహ్వానించారు. అయితే నిమ్జ్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడతారనుకున్న గ్రామాల ప్రజలను, సామాజిక సేవా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను వేదికవద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అనేకమందిని పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుని వెనక్కు పంపించారు. చదవండి: ‘ఆటో’మేటిక్‌గా బతుకు‘చక్రం’ తిరిగింది

సమీప గ్రామాల ప్రజలు కొందరిని మాత్రమే వేదిక వద్దకు అనుమతించారు. అక్కడకూడా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే పోలీసులు వెంటనే వారిని బయటకు పంపించివేశారు. కాగా, పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిమ్జ్‌ను వ్యతిరేకిస్తున్న వందలాది మంది రైతులు పోలీసులకు చిక్కకుండా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మెజారిటీ రైతులు, ప్రజలు నిమ్జ్‌కు వ్యతిరేకంగానే మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదోద్దీన్, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు తదితరులు మాట్లాడారు. భూములు కోల్పోతున్న వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రజలకు నచ్చజెప్పారు. భూములకు ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని, భూములు కోల్పోతున్న వారి కుటుంబంలో ఒకరికి, అవకాశం ఉంటే ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించాలని వారు అధికారులకు సూచించారు. రైతులు, ప్రజలు అపోహ పడవద్దని, కాలుష్య రహిత ఫ్యాక్టరీలే ఇక్కడ ఏర్పాటు చేస్తారని తెలిపారు. జాతీయ పారిశ్రామిక ఉత్పత్తుల కేంద్రం దేశానికే తలమానికం కాబోతున్నదని టీఎస్‌ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి అన్నారు. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయని ఆయన చెప్పారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు