Zero Covid Cases: ఆ ఊరికి కరోనా రాలే..!

10 May, 2021 10:05 IST|Sakshi

ఆదర్శంగా నిలుస్తున్న లవ్వాల గ్రామం

రెండు వేవ్‌లలోనూ జీరో పాజిటివ్‌ 

సమన్వయంతో నియంత్రణ

ఎస్‌ఎస్‌తాడ్వాయి/ములుగు: కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచం గజగజలాడుతోంది. కోవిడ్‌ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తోంది. కానీ, ఈ గ్రామప్రజలు మాత్రం గుట్టలు, చెట్ల మధ్య ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారు. ఆ ఊరే మండలంలోని లింగాల గ్రామపంచాయతీ పరిధిలోని లవ్వాల. ఇక్కడ ఏడాదిన్నర క్రితం నుంచి ప్రపంచ వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో కల్లోకలం సృష్టిస్తున్న కరోనా.. ఈ ఊరికి మాత్రం చేరలేదు. గ్రామంలో 30 కుటుంబాలకు గాను వందమంది జనాభా ఉంది. గ్రామంలోని ఆదివాసీలు వ్యవసాయ పనులతో పాటు కూలీ పనులకు వెళ్తుంటారు. లవ్వాల గ్రామం తాడ్వాయి మండల కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పచ్చని అటవీ ప్రాంతంలోని చెట్లు, గుట్టల మధ్య ఆదివాసీ కుగ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తున్నారు ఇక్కడి జనం.

గ్రామంలోని ఆదివాసీలు అవసరం ఉంటేనే తప్పా ఇతర ప్రాంతాలకు వెళ్లడంలేదు. ప్రతీ వారం గోవిందరావుపేట మండలంలోని పస్రాలో జరిగే సంతకు వెళ్లి వారానికి సరిపడా సరుకులు కొనుగోలు చేసుకొని వస్తారు. వివాహాలు, శుభకార్యాలకు బంధువులు గ్రామానికి వస్తారే తప్పా మిగతా రోజులల్లో దాదాపు అక్కడికి ఎవరూ రారని ఆగ్రామ ఆదివాసీలు చెబుతున్నారు. గ్రామంలోని ఆదివాసీలకు కూడా ఇతర ప్రాంతాల వారితో అంతగా సంబంధాలను కొనసాగించరు. బయటికి వెళ్లే సమయంలో మొఖానికి టవళ్లను అడ్డుపెట్టుకొని జాగ్రత్తలు పాటిస్తామని చెప్పుకొచ్చారు. 

పట్టణ ప్రాంతాలకు వెళ్లరు..
ఈ గ్రామంలోని ఆదివాసీలు ఇతర ప్రాంతాలకు తక్కువగా వెళ్తుంటారు. ముఖ్యంగా పట్టణాలకు అసలు వెళ్లరనే చెప్పాలి. ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లనందున గ్రామంలో ఎవరికీ కరోనా సోకలేదని చెప్పవచ్చు. అధికారుల సూచనల మేరకు ముందు జాగ్రత్తగా కరోనా నిర్ధారణకు ర్యాపిడ్‌ టెస్టులు చేసుకున్నప్పటికీ అందరికీ నెగిటివ్‌గానే తేలింది. గ్రామంలోని వంద మందిలో సుమారు 30 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. పాత కాలం నాటి ఆహార అలవాట్లను నేటికీ కొనసాగించడంతోపాటు పచ్చని చెట్ల మధ్య మా గ్రామం ఉండడంతో ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పవచ్చు. పట్టణాల్లో వలె ఫ్రిజ్‌ వాటర్‌ కాకుండా మట్టికుండలోని నీటిని మాత్రమే తాగుతూ.. కరోనా మహమ్మారికి దూరంగా ఉంటున్నారు. దీంతోపాటు అటవీ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం కూడా వైరస్‌ దరిచేరకుండా ఉండేందుకు ఉపకరిస్తుందని ఆదివాసీలు వివరిస్తున్నారు. 

కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం..
కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు కరోనా బారిన పడకుండా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు లవ్వాల గ్రామంలో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాకపోవడం హర్షనీయం.లవ్వాల ప్రజలు ఇతర ప్రాంతాలవారితో కలవడకపోవడమే కరోనా నియంత్రణకు అసలు కారణం. ప్రతీ ఒక్కరు ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. 
– సత్యాంజనేయప్రసాద్, ఎంపీడీఓ, తాడ్వాయి

అత్యవసరం అయితేనే బయటకు..
పచ్చని చెట్ల మధ్య ఉండడంతోపాటు, ఇక్కడి ప్రజలు అత్యవసరం అయితేనే ఇతర ప్రాంతాలకు వెళ్తారు. అదికూడా కేవలం ఇంటినుంచి ఒక్కరు మాత్రమే జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లి సరుకులు తీసకొస్తారు. గ్రామంలోని ప్రజలు ఎప్పుడు గుంపులుగా చేరరు. అధికారులు చెబుతున్న జాగ్రత్తలు పాటిస్తున్నందునే మా ఊరికి కరోనా రాలేదు.                  
 – కాయం బుచ్చయ్య, లవ్వాల 

చదవండి: తండాలో నో కరోనా..!

మరిన్ని వార్తలు