న్యాయవాదుల హత్య: పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు

20 Feb, 2021 14:35 IST|Sakshi

న్యాయవాద దంపతుల హత్యపై తొలిసారి స్పందించిన మధు

సాక్షి, హైదరాబాద్‌ : హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దారుణ హత్య ఉదంతపై పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్‌, టీఆర్‌ఎస్‌ నేత మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్‌రావు హత్య కేసులో తనను ఇరికించేందుకు కుట్రపన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అనుకూల మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి శ్రీధర్‌బాబు తనపై అనేక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా తనపై విద్వేషపూరిత వార్తలను ప్రచురిస్తోందని, కేసు దర్యాప్తు చేస్తోంది పోలీసులా..? లేక మీడియానా అని ప్రశ్నించారు. శనివారం మంథనిలో నిర్వహించిన టీఆర్ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమలో పాల్గొన్న పుట్ట మధుకర్‌.. తొలిసారి వామన్‌రావు దంపతుల హత్యపై స్పందించారు. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు.

హత్య అనంతరం తాను పారిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని, తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరానని, దానికి సీఎం నిరాకరించారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కొంతమంది తన వ్యతిరేకులు పుట్ట మధును ఎప్పుడెప్పుడు అరెస్టు చేస్తారని ఎదురుచూస్తున్నారని అన్నారు. పేద బిడ్డ జడ్పీ చైర్మన్ అయితే సహించలేక పోతున్నారని కాంగ్రెస్‌ నేతలపై మండిపడ్డారు. పోలీసు విచారణ తర్వాత వాస్తవాలతో హైదరాబాద్‌లో మీడియా ముందుకు వస్తానని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న పత్రికలు, టీవీల గురించి కూడా చెప్తానని అన్నారు. తాను రౌడీయిజం చేస్తున్నట్లు శ్రీధర్‌బాబు ప్రచారం చేస్తున్నారని, అసలు దొంగలు వారేనని విమర్శించారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులు కుంట శ్రీనివాస్‌ను(ఏ1), చిరంజీవిని (ఏ2), అక్కపాక కుమార్‌(ఏ3)ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం పుట్టమధ మేనల్లుడు బిట్టు శ్రీనును కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యలో భాగంగా రిజిస్ట్రేషన్‌ కాని బ్రీజా కారును, కొబ్బరికాయలు కోసే కత్తులను బిట్టు శ్రీను ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌కు సమకూర్చాడు. ఈ క్రమంలోనే పుట్టమధు పాత్రపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మేనల్లుడు హత్య కేసులో ఇరుక్కోవడంతో విమర్శల తాకిడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.

 

లాయర్ దంపతుల హత్య.. రెండు గంటల్లోనే స్కెచ్‌ 

మరిన్ని వార్తలు